Bhuma Mounika Political Entry: అటు భూమా, ఇటు మంచు.. మౌనిక ఎంట్రీ ఏ పార్టీ నుంచి, పోటీ ఎక్కడి నుంచి..?
భూమా కుటుంబానికి టీడీపీ, వైసీపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. భూమా దంపతులు ఈ రెండు పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులు అయ్యారు. దాంతో టీడీపీలో అఖిలప్రియ రాజకీయంగా స్థిరపడినందున మౌనికా రెడ్డి వేరే ప్రత్యామ్నాయలు చూసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.
- Naveen
- Published on- May 20, 2026 / 09:47 PM IST
- మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ
- ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న భూమా మౌనిక
- టీడీపీలో అఖిలప్రియ..వైసీపీకి సపోర్ట్‌గా మంచు ఫ్యామిలీ
- మంచు మనోజ్, మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఏ పార్టీ నుంచి?
- మౌనిక ఎక్కడి నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.?
Bhuma Mounika Political Entry: ఇటు భూమా ఫ్యామిలీ. అటు మంచు కుటుంబం. అక్క బాటలో పాలిటిక్స్‌లోకి చెల్లి. నాన్న, అన్న రూట్‌లో బ్యాక్ ఎండ్‌లో మంచు విష్ణు. భూమా ఇంటి ఆడబిడ్డ, మంచు గారి కోడలు..భూమా మౌనిక రాజకీయ అరంగేట్రం ఖాయమైంది. తన భార్య రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సినీ నటుడు మంచు మనోజ్ ప్రకటించారు. భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ…ఏ పార్టీ నుంచి? ఎమ్మెల్యేగానా..ఎంపీగానా? ఆమె ఏ సీటు నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు?
భూమా మౌనిక రెడ్డి రాజకీయ అరంగేట్రం ఖాయమని కన్ఫామ్ అయింది. సినీ నటుడు, మౌనిక భర్త మంచు మనోజ్ తన భార్య పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. భూమా మౌనికకు రాజకీయాలు కొత్త కాదన్న మనోజ్..భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీంతో రాయలసీమతో పాటు కర్నూలు, ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు తమ మార్క్ పాలిటిక్స్‌తో ప్రత్యేక గుర్తింపు, పేరు సంపాదించుకోవడమే కాదు..కీలక పాత్ర పోషించారు.
నాగిరెడ్డి, శోభ మరణానంతరం..వారి కుటుంబంలో ఇద్దరు బిడ్డలు, కుమారుడు రాజకీయ అవకాశాల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి దంపతుల రాజకీయ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అఖిలప్రియ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం ఆమె టీడీపీ తరఫున ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
భూమా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె, మంచు మనోజ్ సతీమణి మౌనిక కూడా ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తిగా చూపిస్తున్నారు. మంచు మనోజ్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేయడంతో పాటు..మౌనికది రాజకీయ కుటుంబమే అని స్పష్టం చేయడంతో భూమా మౌనికారెడ్డి పొలిటికల్ అరంగేట్రంపై రకరకాల ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. భూమా కుటుంబంలో ఇద్దరు ఆడబిడ్డలు, ఒక సోదరుడు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడే పరిస్థితి ఏర్పడిందన్న చర్చ స్టార్ట్ అయింది. అఖిలప్రియకు గతంలో మౌనిక రాజకీయంగా అండగా నిలిచి ఆమె విజయానికి సహకరించారు. వారి సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా అఖిలప్రియ వెంట నడుస్తున్నారు.
టీడీపీతోనే వీరి రాజకీయాలు కొనసాగుతాయా?
మౌనికా రెడ్డి రాజకీయాల్లోకి వస్తే ఆమె దారెటు అన్నది బిగ్ క్వశ్చన్‌గా మారింది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి చేస్తారు, ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా ఇవన్నీ చర్చకు దారి తీస్తున్నాయి. మంచు మనోజ్, భూమా మౌనిక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి రాజకీయ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలే చేశారు. కానీ తన సతీమణి మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ కుటుంబం టీడీపీకి సన్నిహితంగా ఉంటోంది. తరచుగా మంత్రి నారా లోకేశ్‌తో మనోజ్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీతోనే వీరి రాజకీయాలు కొనసాగుతాయా? లేక వైసీపీ, జనసేన, బీజేపీలో ఏదో ఒక పార్టీ వైపు చూస్తారా.? అనేది స్పష్టత రావాల్సి ఉంది.
వైసీపీతో మంచు మోహన్‌బాబు, విష్ణుకు సంబంధాలు..
ఇక భూమా కుటుంబానికి టీడీపీ, వైసీపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. భూమా దంపతులు ఈ రెండు పార్టీల నుంచి ప్రజా ప్రతినిధులు అయ్యారు. దాంతో టీడీపీలో అఖిలప్రియ రాజకీయంగా స్థిరపడినందున మౌనికా రెడ్డి వేరే ప్రత్యామ్నాయలు చూసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో పార్టీలో భూమా దంపతులు పనిచేయడంతో..మౌనిక జనసేన వైపు వెళ్లొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు మంచు మనోజ్ తండ్రి మోహన్‌బాబు, సోదరుడు విష్ణు వైసీపీతో సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. మంచు విష్ణుకు అతని భార్య తరఫున..వైసీపీ అధినేత జగన్ బంధువు అవుతారు. దీంతో మనోజ్ అటువైపు వెళ్లకపోవచ్చన్న టాక్ నడుస్తోంది.
ప్రస్తుతానికి అయితే భూమా మౌనికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ కావడంతో..కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అక్కా, చెల్లెలు ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకుని రాజకీయంగా ముందుకు సాగుతారా? లేక రాజకీయ వారసత్వం కోసం చెరో పార్టీ నుంచి ఎదురెదురుగా పోటీ పడుతారా? అనేది చూడాలి.
Also Read: యువతి తల్లిదండ్రులను చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష.. వరంగల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
