Amaravati: అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

అమ‌రావ‌తి ముసుగులో జ‌రుగుతున్న భూ దోపిడీకి, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అని సజ్జల, కేతిరెడ్డి లాంటి వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

  • Published On : March 30, 2026 / 08:32 PM IST

 

Amaravati: అవును అంటూనే కాదని ! కన్ఫ్యూజింగ్‌గా ఉందా.. ఇప్పుడు ఏపీలో చాలామందిలో జరుగుతున్న చర్చ ఇదే ! ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. ఎవరు ఉన్నా.. ఎవరు వచ్చినా.. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అంటూ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ. కేంద్రానికి కూడా పంపించింది. ఐతే దీనిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయ్‌. ఇంతకీ అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి.. పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి..

ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ.. దానికి చట్టబద్ధమైన అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వారా తీర్మానం ఆమోదించింది. విభజన చట్టం సెక్షన్ 5ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింపచేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానించింది. అమరావతి రాజధానిగా చట్టబద్దత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని.. రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు పంపించారు అసెంబ్లీ స్పీకర్‌. ఇక అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా.. తీర్మానం కాపీని పంపించారు. ఇక తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు.. వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా.. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై వైసీపీ స్టాండ్ ఏంటన్నది ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

స్టాండ్ ఏంటి అనేది ఎక్కడా చెప్పని వైసీపీ..

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన అమరావతి చట్టబద్ధత తీర్మానంపై.. వైసీపీ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తన స్టాండ్ ఏంటి అనేది ఆ పార్టీ ఎక్కడా చెప్పలేదు. ఐతే కొందరు ఫ్యాన్ పార్టీ నేతల వ్యాఖ్యలు.. జనాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయ్‌. ఔను అని కొందరు.. కాదు అన్నట్లుగా మరికొందరు నేతలు వ్యాఖ్యలు చేయడం.. మరింత హాట్‌టాపిక్ అవుతోంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని.. ఆ ప్రాంతం రాజ‌ధానిగా ఉండ‌కూడ‌ద‌ని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని.. ఐతే అమ‌రావ‌తి ముసుగులో జ‌రుగుతున్న భూ దోపిడీకి, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అని సజ్జల, కేతిరెడ్డి లాంటి వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకూ పనికిరాదని.. రాజధానిపై నిర్ణయం రాష్ట్రాల ఇష్టమని మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. అమరావతి వ్యవహారంలో ఔను అంటూనే.. కాదు అన్నట్లుగా ఫ్యాన్‌ పార్టీ తీరు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌.

పార్లమెంట్‌లో అయినా స్టాండ్ ఏంటనేది చెప్తుందా?

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన అమరావతి చట్టబద్ధత తీర్మానం.. కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చకు వచ్చి.. ఆమోదం లభించే అవకాశం రాష్ట్రంలో నేతల తీరు ఇలా ఉంటే.. పార్లమెంట్‌లో అయినా అమరావతిపై తమ స్టాండ్ ఏంటనేది వైసీపీ చెప్తుందా లేదా అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ పార్టీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయ్‌. చివరి రోజు అమరావతి బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందనే చర్చ నడుస్తోంది. ఐతే వైసీపీ ఎంపీల మాట ఏంటనేది ఆసక్తి రేపుతోంది. అమరావతి రాజధానికి తాము అనుకూలమే కానీ.. రాజధాని పేరుతో జరిగే దోపిడీకి వ్యతిరేకమని వాదిస్తున్న వైసీపీ.. పార్లమెంట్‌లోనూ అదే చెప్పే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ నడుస్తోంది.

అమరావతి చట్టబద్ధత పనికి రాదు.. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం అనే వైసీపీ నేతల మాటలకు అర్థం ఏంటంటూ మరికొందరిలో చర్చ నడుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. అమరావతి రాజధాని వ్యవహారానికి అంత ఈజీగా ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రచ్చ ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయ్‌. అధికార, విపక్షాల మధ్య మరింత మాటల యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా వినిపిస్తోంది.

Also Read: నామినేషన్ దాఖలు చేసిన విజయ్.. ఆయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..!