AP Tidco Houses: ఏపీ పట్టణ పేదలకు ‘టిడ్కో ఇళ్లు’.. సర్కార్ సరికొత్త ప్లాన్.. త్వరలోనే పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంత పేద ప్రజల సొంతింటి(AP Tidco Houses) కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
- V Santhosh Kumar
- Published on- September 18, 2026 / 03:48 PM IST
Government is set to construct TIDCO houses for the urban poor in Andhra Pradesh.
- టిడ్కో ఇళ్ల శుభవార్త
- నగరాల్లోనే 14 అంతస్తులు
- 430 చదరపు అడుగులు
AP Tidco Houses: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంత పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పట్టణాలకు దూరంగా కాకుండా, పేదలు నివసించే పరిసర ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలలో అత్యాధునిక సౌకర్యాలతో టిడ్కో (AP Tidco Houses) ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈసారి అన్ని ఫ్లాట్లను విశాలంగా 430 చదరపు అడుగుల (Sq.Ft) విస్తీర్ణంలో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. స్థలం లభ్యతను బట్టి జీ+8 నుండి జీ+14 అంతస్తుల వరకు టవర్లను నిర్మించబోతున్నారు.
KTR: మా ఆస్తులన్నీ ఇస్తాం వెయ్యికోట్లు ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన ఆఫర్
ఆధునిక వసతులు.. పార్కింగ్, లిఫ్ట్ సహా వాణిజ్య ప్రాంగణాలు:
పెరుగుతున్న జనాభా, స్థలం కొరతను దృష్టిలో ఉంచుకుని హైరైజ్ విధానాన్ని ఖరారు చేశారు. ఈ నూతన టిడ్కో టవర్లలో లిఫ్ట్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, బ్యాంకులు, షాపులు వంటి కమర్షియల్ కాంప్లెక్స్ సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని బహుళ అంతస్తుల హౌసింగ్ మోడళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, అత్యుత్తమ డిజైన్లను సిద్ధం చేయగా ప్రభుత్వం వీటికి ఇప్పటికే ఆమోదముద్ర వేసింది.
అంతస్తులను బట్టి నిర్మాణ వ్యయం.. రూ.15 లక్షల నుంచి ప్రారంభం:
అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఫ్లాట్ ధర రూ.15.70 లక్షల నుండి రూ.17.51 లక్షల వరకు ఉండనుండగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నాయి. ఇప్పటికే 24 వేల మందికి పైగా అర్హులు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం సర్వేను ముమ్మరం చేసింది. ఎటువంటి అవినీతికి తావులేకుండా ఈ పారదర్శక గృహ నిర్మాణ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
