Kodali Nani : సొంత ఆస్తిలో వాటాలు ఇచ్చిన వ్యక్తి జగన్.. ఆయనపై నిందలేస్తున్నారు : కొడాలి నాని

Kodali Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

kodali nani key comments about ys jagan and 2029 elections at ntr district

Kodali Nani : 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీదే విజయం అని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా ఎవరికీ లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. జగన్‌పై నిందలు వేయడం దారుణం అన్నారు. తాజాగా కొడాలి నాని ఎన్టీఆర్ జిల్లా జొన్నపాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి తల్లి గారికి నివాళులర్పించారు. ఆ తర్వాత కొడాలి నాని మాట్లాడుతూ.. తండ్రి చనిపోతే.. ఆయన ఆస్తిలో వాటా ఇచ్చేవాళ్లని చూశాం. కానీ తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి జగన్. అలాంటి జగన్ గురించి తప్పుగా మాట్లాడటం దారుణమన్నారు. జగన్ ఎప్పుడూ తన చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. లడ్డూ అంశంలో కూడా కూటమి నీచ రాజకీయాలను దేవుడు చూస్తున్నాడని.. త్వరలోనే వారికి బుద్ధి చెబుతాడని కొడాలి నాని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తుందని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు అండ్ కూటమి దొంగ వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తమ నాయకుడు జగన్ మాట ఇస్తే తప్పరని జనాలకు కూడా తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే.. పేదలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారన్నారు. సూపర్‌-6 అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని.. దొంగ వాగ్దానాలతోనే ఆయన అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేశారని వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని చెబుతారన్నారు. 2029లో వైఎస్ జగన్‌ను ప్రజలు గెలిపిస్తారని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ విలువ తెలిసిందని.. ఆయనను వదులుకున్నామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. జగన్ ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేదలు భావిస్తున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదన్నారు. కావాలనే వైఎస్ జగన్‌పై నిందలు మోపుతున్నారని కొడాలి నాని ఆవేదన వ్యక్తం చేశారు.