AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండ్రోజులు భారీ వర్షాలు.. భీకర గాలులు..

AP Rains : వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.

AP Rains

AP Rains : వర్షాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, వచ్చేవారంలో వర్షాల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read : Nanded Accident: మహారాష్ట్రలో భయంకర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టాటా మ్యాజిక్.. 9 మంది దుర్మరణం!

ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచకించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పోలవరం, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, అనకాపల్లి, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅ వకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5గంటల సమయం వరకు అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నంగినారపాడు, వూడేరులో 34.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లినా.. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరించారు.