Mahanadu Donations : మహానాడులో విరాళాల వెల్లువ.. ఆ దంపతులే రూ. 5 కోట్లు ఇచ్చారు.. ఒక్క రోజే ఇన్ని కోట్లా!

Mahanadu Donations : పసుపు పండగ మహానాడు తొలి రోజు భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి.

mahanadu 2026 tdp received rs 12 cr donations on first day details here

  • మహానాడులో భారీగా విరాళాలు
  • తొలి రోజే రూ.12.44 కోట్లు
  • రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు

Mahanadu Donations : తెలుగు దేశం పార్టీ ఉత్సవంగా భావించే పసుపు పండగ, మహానాడు కార్యక్రమం మే 27 బుధవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. ప్రతి ఏటా వేల మంది కార్యకర్తల సమక్షంలో వైభవంగా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈసారి ఇంధన సంక్షోభం కారణంగా ప్రధాని పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్ గా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఇక మహానాడు వేదికగా కాసుల వర్షం కురిసింది. మహానాడు కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన బుధవారం నాడు పార్టీకి భారీ ఎత్తున విరాళాలు వెల్లువెత్తాయి. తొలి రోజే ఏకంగా రూ.12.44 కోట్ల విరాళాలు అందినట్లు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభావేదిక నుంచి అధికారికంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మహానాడు కావడంతో నేతలు, ప్రజాప్రతినిధులు పోటీ పడి మరీ తమ విరాళాలను ప్రకటించారు.

వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం..

మహానాడు వేదికగా వచ్చిన విరాళాల్లో ఎక్కువ మొత్తం ఇచ్చింది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు. వీరు ఏకంగా రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చి పార్టీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. వీరితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ చెరో రూ.1.50 కోట్లు చొప్పున మొత్తం రూ. 3 కోట్లు పార్టీ నిధికి అందజేశారు.

పోటీపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు..

మంత్రులు టి.జి. భరత్, బీసీ జనార్దన్‌రెడ్డిలతో పాటు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాష్యం రామకృష్ణ తలా రూ. కోటి చొప్పున భారీ విరాళం ప్రకటించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విరాళాలు ఇవ్వడంలో పోటీ పడ్డారు. మంత్రి సవిత రూ.50 లక్షలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రూ.25 లక్షలు, దామచర్ల సత్య రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు.

రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు ఇచ్చిన మరికొందరు నేతలు:

  • రూ. 10 లక్షలు: ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, శిష్ట్లా లోహిత్‌
  • రూ. 5 లక్షలు: ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్యే రాధాకృష్ణ, గోవర్దన్‌రెడ్డి
  • రూ. 3 లక్షలు: ఎంవీ ప్రణవ్‌గోపాల్‌
  • రూ. 2 లక్షలు: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌, డూండి రాకేశ్‌
  • రూ. 1.26 లక్షలు: కోటేశ్వరరావు

అలాగే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, అశోక్‌బాబు, నాదెండ్ల బ్రహ్మంచౌదరి, గుమ్మడి గోపాలకృష్ణ, హరిప్రసాద్, జయంతి తదితరులు రూ. లక్ష చొప్పున విరాళం ప్రకటించారు.

మహానాడు తొలిరోజే ఈ స్థాయిలో విరాళాలు రావడంపై చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.