AP Rain Alert : ఏపీలో ఇవాళ, రేపు భారీ వర్షాలు.. తొమ్మిది జిల్లాలకు రెడ్‌అలర్ట్.. బయటకు రావొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు

AP Rain Alert : ఏపీలో రెండు రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

AP Rain Alert

  • ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్
  • రెండు రోజులు భారీ వర్షాలు కురిసే చాన్స్
  • తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

AP Rain Alert April 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరో రెండు రోజులు వాతావరణ పరిస్థితులు ఇలానే ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read : ఏపీలోని ఇంటర్, 10th విద్యార్థులకు బిగ్ అప్డేట్ ఫలితాలు వెల్లడి తేదీలు ఇవే

దక్షిణ కోస్తాంధ్ర – పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించిందని ఏపీ ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి , ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, భారీ స్థాయిలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళొద్దని, చెట్లకింద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైతులు పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రబీలో రైతులు సాగు చేసిన పంటలు కోత దశలో ఉన్నాయి. పలు పంటల ఉత్పత్తులు కల్లాల్లో ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని, హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.