AP Rains : దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ..

AP Rains : వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్పపీడనం తుపానుగా మారితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rains

AP Rains : ఏపీలో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ ఏపీలో వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఏపీకి తుఫాన్ ముప్పు పొంచిఉందని, ఈనెల 22, 23 తేదీల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.

Also Read : AP Dugarajapatnam Shipyard: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దుగరాజపట్నంలో రూ. 15,000 కోట్లతో షిప్‌ యార్డ్.. 45 వేల మందికి ఉద్యోగాలు!

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి మూడు నాలుగు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 21న మధ్యాహ్నం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా బలపడుతుందని, 22న తీవ్ర వాయుగుండంగా లేదంటే తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అల్పపీడనం తుపానుగా మారితే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా దానికి ఆనుకొని దక్షిణ ఒడిశాలో తీరందాటే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో ఈనెల 22, 23 తేదీల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఇవాళ (శనివారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.