AP Health Department: ఏపీలోని పేషెంట్లకు గుడ్ న్యూస్.. గుంటూరు జీజీహెచ్‌లో అధునాతన ల్యాబ్.. రూ.75 వేల టెస్ట్ ఉచితం!
ఆంధ్రప్రదేశ్ (AP Health Department)రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులకు ఆసరాగా నిలిచేలా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
- V Santhosh Kumar
- Published on- September 21, 2026 / 03:05 PM IST
Minister Satya Kumar to launch free cancer genetic testing center at Guntur GGH
AP Health Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులకు ఆసరాగా నిలిచేలా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్) ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక జన్యు పరీక్షల (జెనెటిక్ టెస్టింగ్) ప్రయోగశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన సదుపాయాన్ని ఆరోగ్య శాఖ (AP Health Department)మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనుండగా, ఇది రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ పరిధిలో అందుబాటులోకి రావడం విశేషం. ఏపీ ప్రభుత్వం, ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ల్యాబ్ ద్వారా క్యాన్సర్ రోగుల జన్యు ప్రొఫైల్‌ను స్థానికంగానే విశ్లేషించి సరైన చికిత్స అందించేందుకు మార్గం సుగమమైంది.
కార్పొరేట్ స్థాయిలో ఉచిత పరీక్షలు.. రోగులకు వేల రూపాయల ఆదా:
ఇప్పటివరకు మాలిక్యులర్ మ్యుటేషన్ పరీక్షల కోసం శాంపిళ్లను బెంగళూరు, ముంబై వంటి నగరాలకు పంపాల్సి రాగా, ఇకపై ఆ అవసరం లేకుండా గుంటూరులోనే రోగ నిర్ధారణ పూర్తి కానుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ జన్యు పరీక్షలకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు, సమగ్ర విశ్లేషణకు రూ.75,000 వరకు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనుంది. రాబోయే రెండేళ్ల వ్యవధిలో తొలి విడతగా 1,000 రొమ్ము క్యాన్సర్, 1,000 ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల శాంపిళ్లను సేకరించి ఉచితంగా పరీక్షించనున్నారు.
భవిష్యత్ ప్రణాళికలు.. అమరావతిలో పూర్తిస్థాయి జన్యు సమాచార కేంద్రం:
మొదటి దశలో BRCA1, BRCA2 వంటి జన్యు మార్పులను గుర్తించడం ద్వారా కచ్చితమైన ఔషధ చికిత్సను అందించనున్నారు. గుంటూరులోని ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత అమరావతి క్వాంటం వ్యాలీలో భారీ సామర్థ్యంతో కూడిన రాష్ట్రస్థాయి జన్యు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి 60,000 ఛాతీ ఎక్స్-రేలను విశ్లేషించడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు, అలాగే ఒకే రక్త పరీక్షతో 14 రకాల క్యాన్సర్లను పసిగట్టే పరిశోధనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
