కరోనా కేసులతో బెజవాడ వాసులు బెంబేలెత్తిపోతోంది. కరోనా కట్టడికి పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వాహనాలన సీజ్ చేసి ఫైన్ లు వేసినా పట్టించుకోలేదు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని అంబులెన్స్ లో ఎక్కించి క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు.
కృష్ణ లంక, లెనిన్ సెంటర్ లో లాక్ డౌన్ అంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యవసర వస్తువుల కోసం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపే బయటికి రావాలని సూచిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటికి వస్తే క్రిమినల్ కేసులతోపాటు క్వారంటైన్ కు తరలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1583కి చేరింది. ఇప్పటివరకు 488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో 1062 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 30 కరోనా కేసులు కొత్తగా నమోద అయ్యాయి. గత 24 గంటల్లో 6వేల 534 శాంపుల్స్ పరీక్షించగా 58మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.