Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ అతి పెద్ద కుంభకోణాన్ని జనంలోకి తీసుకువెళ్లాలి: జనసేన నేత నాదెండ్ల
అతిపెద్ద కుంభకోణాన్ని విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతం నుంచి పవన్ బయటపెట్టారని చెప్పారు.
- T Venkateshwarlu
- Updated on- July 27, 2023 / 03:50 PM IST
Nadendla Manohar
Nadendla Manohar – JanaSena: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుంభకోణాన్ని మరోసారి సామాజిక మాధ్యమాల క్యాంపెయిన్ రూపంలో జనంలోకి తీసుకువెళ్లాలని తమ పార్టీ నిర్ణయించిందని చెప్పారు.
జనసేన శ్రేణులతో నాదెండ్ల మనోహర్ ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న కాలనీల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ కు పిలుపునిచ్చిస్తున్నట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి జగనన్న కాలనీలను సందర్శించి అక్కడి పరిస్థితులను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలని అన్నారు.
జగనన్న కాలనీల పేరిట జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని విజయనగరం జిల్లా గుంకలాం ప్రాంతం నుంచి పవన్ బయటపెట్టారని చెప్పారు. డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు గత ఏడాది తెలియచెప్పే ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. నిరుపయోగంగా ఉన్న భూములను వైసీపీ నేతలు తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరకు ప్రభుత్వానికి అమ్ముకున్నారని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో చెరువుల్ని ఆక్రమించి ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన పేరిట రూ. 89 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటనలు చేస్తోందని, ఆ డబ్బంతా ఎటు పోతుందని నిలదీశారు.
