Nara Lokesh: ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు, ఉత్సవ కమిటీలకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని వెల్లడించారు.
Nara Lokesh announces free electricity for Devi Navaratri mandapas
Nara Lokesh: దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)రాష్ట్రంలోని భక్తులకు, ఉత్సవ కమిటీలకు భారీ ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా అనుమతులు పొందిన అన్ని దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్లు ఆయన ‘ఎక్స్’ (X) వేదికగా స్పష్టం చేశారు. పండుగను ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలు, సంతోషాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్ నిబంధనలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు పరిమితులు:
ఈ పథకం పరిమితులకు లోబడి అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోని మండపాలకు 3 కిలోవాట్లు (3 KW), పట్టణ ప్రాంతాల్లోని మండపాలకు 5 కిలోవాట్ల (5 KW) వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం వర్తిస్తుందని వివరించారు. ఈ నిర్ణయంతో ఉత్సవ కమిటీలపై విద్యుత్ భారం తగ్గి పండుగ కళ సంతరించుకోనుంది. ప్రజలపై అమ్మవారి దివ్య ఆశీస్సులు నిరంతరం ఉండాలని, ఈ నవరాత్రులు అందరి జీవితాల్లో మంగళకరంగా సాగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
