Chandrababu Arrest: ఉండవల్లిలో తన నివాసానికి చేరుకున్న నారా లోకేశ్.. పోలీసులు ఏం చేశారంటే..
చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో లోకేశ్ సమీక్షించారు. చంద్రబాబును పోలీసులు ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి వెళ్లే యోచనలో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.
- Harishth Thanniru
- Published On : September 9, 2023 / 03:54 PM IST
Nara lokesh
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును ప్రత్యేక కాన్వాయ్ ద్వారా అమరావతికి తరలిస్తున్నారు. కూంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించనున్నట్లు తెలిసింది. అక్కడికి తీసుకెళ్లి చంద్రబాబును విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. అనంతరం అక్కడే వైద్య పరీక్షలు చేయించి ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
మరోవైపు చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలకు దిగుతున్నారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడే అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యనేతలను ఉదయం నుంచి గృహనిర్భందం చేశారు. ఉదయం చంద్రబాబును అరెస్టు వెంటనే యువగర్జన పాదయాత్రను నిలిపివేసి విజయవాడకు నారా లోకేశ్ బయలుదేరారు. కానీ, పోలీసులు లోకేశ్ ను అడ్డుకోవటంతో అక్కడై బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం సమయంలో విజయవాడ వెళ్లేందుకు లోకేశ్ కు పోలీసులు అనుమతి ఇవ్వడంతో రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని తన నివాసానికి నారాలోకేశ్ చేరుకున్నారు.
Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్.. ప్రత్యేక విమానంలో అమరావతికి పవన్ కళ్యాణ్
చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో లోకేశ్ సమీక్షించారు. చంద్రబాబును పోలీసులు ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి వెళ్లే యోచనలో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు వచ్చే ప్రాంతానికి లోకేశ్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. లోకేశ్ నివాసం వద్ద పోలీసులను మోహరించినట్లు తెలిసింది.
