Nara Lokesh: బీసీలకు 34 శాతం సీట్లు ఇచ్చి తీరుతాం.. కోర్టు తీర్పుతో సంబంధం లేదు.. లోకేశ్ సంచలన ప్రకటన
బీసీలకు 34 శాతానికి పైగా సీట్లు ఇవ్వడంపై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి నారా లోకేష్(Nara Lokesh).
- V Santhosh Kumar
- Updated on- October 8, 2026 / 04:19 PM IST
Nara Lokesh stated that 34 percent of seats would be allocated to BC in local body elections.
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర నాలెడ్జ్ అండ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)స్పష్టం చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు విచ్చేసిన ఆయన, ప్రజల నుంచి స్వయంగా అర్జీలు, వినతులను స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన లోకేశ్, బీసీ రిజర్వేషన్ల అంశంలో తమ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అత్యంత స్పష్టమైన వైఖరితో ఉన్నాయని వెల్లడించారు. బీసీల సంక్షేమం, రాజకీయ భాగస్వామ్యమే ధ్యేయంగా కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా పార్టీ పరంగా కనీసం 34 శాతానికి పైగా స్థానాలను బీసీ అభ్యర్థులకే కేటాయిస్తామని ప్రకటించారు.
వైకాపాపై తీవ్ర విమర్శలు.. ‘ఓటమి భయంతోనే సుప్రీం కోర్టుకు వెళ్లారు’:
ఈ సందర్భంగా ప్రతిపక్ష వైకాపా తీరుపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకుండానే అభ్యర్థులను ప్రకటించిన ఘనత కేవలం ‘గొడ్డలి పార్టీ’కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని, ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే సుప్రీంకోర్టు వరకు వెళ్లారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని, తమ ప్రభుత్వం బీసీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక ప్రకటన.. పనితీరు ఆధారంగానే రెన్యువల్:
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే కాలపరిమితి పూర్తయిన వివిధ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని లోకేశ్ వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు, శ్రేణులకు మాత్రమే నామినేటెడ్ పదవుల రెన్యువల్ ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ నియామకాలలోనూ క్రియాశీలకంగా వ్యవహరించే కేడర్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం ద్వారా పార్టీ వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
