NEET-UG 2026: నీట్-యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
నీట్ 2026 (NEET-UG 2026)ప్రవేశాల కౌన్సెలింగ్ వివరాలను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పులాల చంద్రశేఖర్ అధికారికంగా విడుదల చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 2, 2026 / 06:52 AM IST
Neet ug 2026 counseling schedule released dr ntr health university
- నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 8 తరగతులు ప్రారంభం
- అక్టోబర్ 10 ఆఖరి తేదీ
NEET-UG 2026: వైద్య విద్యనభ్యసించాలనుకునే వేలాది మంది విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న నీట్ (NEET-UG) 2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పులాల చంద్రశేఖర్ ఈ మేరకు ప్రవేశాల కౌన్సెలింగ్ వివరాలను అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో చేరేందుకు ఈ ప్రక్రియ అత్యంత కీలకమైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మొదటి సంవత్సరం పాఠ్యాంశాలు సెప్టెంబర్ 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులందరూ సమయాన్ని వృథా చేయకుండా గడువు లోపల దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాలని వీసీ సూచించారు.
మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు:
అఖిల భారత కోటా తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరగనుండగా, చేరడానికి ఆగస్టు 22 వరకు గడువు ఇచ్చారు. రాష్ట్ర కోటా మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు పూర్తయి, ఆగస్టు 28 లోపు సీట్లు పొందిన వారు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. అభ్యర్థుల వివరాల ధృవీకరణ AIQ కి ఆగస్టు 23న, రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 29న జరుగుతుంది. ఇక రెండవ విడత AIQ కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు (చేరేందుకు సెప్టెంబర్ 8 వరకు సమయం), రాష్ట్ర కోటాలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు (చేరేందుకు సెప్టెంబర్ 14 వరకు సమయం) నిర్వహించనున్నారు.
మూడో విడత, స్ట్రే వేకెన్సీ రౌండ్ వివరాలు:
మూడో విడత AIQ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు సాగుతుంది, ఎంపికైన వారు సెప్టెంబర్ 26 లోపు చేరాలి. అదేవిధంగా రాష్ట్ర కోటా మూడో విడత సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు జరిగి, అక్టోబర్ 1 నాటికి ప్రవేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగిలిపోయిన సీట్ల భర్తీకి చేపట్టే ఆఖరి ‘స్ట్రే వేకెన్సీ’ రౌండ్ AIQ కి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు, రాష్ట్ర కోటాకు అక్టోబర్ 3 నుంచి 5 వరకు జరుగుతాయి. ఈ రౌండ్‌లో సీటు లభించిన అభ్యర్థులు అక్టోబర్ 10, 2026 నాటికి నిర్దేశిత వైద్య కళాశాలల్లో చేరి తమ ప్రవేశాలను ఖరారు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
