Non Veg Bandh: నాన్‌వెజ్ లవర్స్‌కు షాక్.. మాంసం విక్రయాలు బంద్.. ఎందుకు అంటే
అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్స్ లో మాంసం విక్రయాలు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోడి, మేక, గొర్రె, చేపలు విక్రయాలు చేయరాదని ఆదేశించారు.
- Naveen
- Published On : March 31, 2026 / 05:03 PM IST
Non Veg Bandh: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాంసం విక్రయాలు బంద్ అయ్యాయి. వారం రోజులు మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. చందాపురం గ్రామంలో డయేరియా ప్రబలుతోంది. దీంతో మున్సిపల్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వారం రోజులు అన్ని రకాల మాంసం విక్రయాలను నిషేధిస్తూ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ పురపాలక సంఘం పరిధిలో ఉన్న అన్ని హోటల్స్, చికెన్ షాపులు, కర్రి పాయింట్స్ లో మాంసం విక్రయాలు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కోడి, మేక, గొర్రె, చేపలు విక్రయాలు చేయరాదని ఆదేశించారు. మార్చి నెల 30 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లలో మాంసాహార వంటకాలను వండటం లేదా విక్రయించడం చేయరాదని ఆదేశాల్లో తేల్చి చెప్పారు అధికారులు. నిబంధనలను అతిక్రమించి మాంసం విక్రయాలు జరిపితే సదరు దుకాణాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చందాపురంలో కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా డయేరియా ప్రబలుతున్నట్లు అధికారులు గుర్తించారు. మాంసం విక్రయ కేంద్రాల దగ్గర అపరిశుభ్రత వల్ల వ్యాధి మరింత విస్తరించే అవకాశం ఉండటంతో అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ వివరించారు. డయేరియా నియంత్రణకు మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. ప్రజలకు కీలక సూచనలు చేశారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
నందిగామ శివారు చందాపురం గ్రామంలో డయేరియా తీవ్రంగా ప్రబలుతోంది. నందిగామ పురపాలక సంఘం పరిధిలో గొర్రె, మేక, కోడి, చేపలు ఇతర మాంసపు విక్రయదారులు మార్చి 30 నుండి ఏప్రిల్ 08 వరకు ఎటువంటి మాంసాహారములను విక్రయించరాదు. మిలటరీ భోజన హోటళ్ళు నందు కూడా ఎటువంటి మాంసాహారము తయారు చేసి అమ్మకాలు జరుపరాదు. అదే విధంగా కర్రీ పాయింట్లలో కూడా ఏ విధమైన మాంసాహార కూరలను విక్రయించరాదు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మాంసాహార వినియోగము, అమ్మకములు నిషేదించబడినది. ఈ ఆదేశాలు ధిక్కరించిన హోటల్ యజమానులపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ -1965 Sec 278 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు పురపాలక సంఘం కమిషనర్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
Also Read: చికెన్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. రేపటి నుంచి చికెన్ షాపులు బంద్.. ఎందుకు, ఎప్పటివరకు అంటే
