Pawan Kalyan: హస్తకళాకారులకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే కలప, క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు.. డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం

వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు, ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) నేతృత్వంలో అటవీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.

Pawan Kalyan announced craft wood banks to provide wood at low prices

  • తక్కువ ధరకే నాణ్యమైన కలప
  • ఆరు క్లస్టర్లలో వుడ్ బ్యాంకులు
  • దళారుల వ్యవస్థకు చెక్ పెడుతూ

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ, వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిని నమ్ముకున్న కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)నేతృత్వంలో అటవీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముడిసరకు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొయ్య బొమ్మలు, వీణల తయారీదారులకు నాణ్యమైన కలపను లాభాపేక్ష లేకుండా, కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులకే తక్కువ ధరలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ కలప సేకరణను అరికడుతూనే దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే సరుకు సరఫరా చేయడం ద్వారా కళాకారుల ఉత్పత్తి ఖర్చులు భారీగా తగ్గనుంది. ఈ చర్యలు భావితరాలను సంప్రదాయ కళల వైపు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రాన్ని క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తాయి.

Rajasthan: రూ.5 లక్షలు భూమిలో పాతిపెట్టాడు.. మర్చిపోయాడు.. తీరా కొన్నాళ్ల తరువాత చూస్తే షాక్..

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు, కలప లభ్యత ప్రణాళిక:

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ లను ఏర్పాటు చేయడానికి అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బొమ్మల తయారీ కోసం తెల్లపొణికి కలపను, విశాఖ పరిధిలోని ఏటికొప్పాక లక్క బొమ్మల కోసం అంకుడు కర్రను అందుబాటులో ఉంచారు. అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో టేకు, నాన్-టేకు కలపను, తిరుపతి జిల్లా మాధవమాలలో సంప్రదాయ చెక్కతో పాటు నారియేపి, తుమ్మ, ఎర్రచందనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఉదయగిరి చెక్క కళాకారులతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన పనస, రోజ్‌వుడ్ కలపను సిద్ధం చేశారు.

అటవీ వనరుల సంరక్షణ, భవిష్యత్తు కార్యాచరణ:

వుడ్ బ్యాంకుల డిజైన్, నిర్వహణలో ఒకే రకమైన నమూనా పాటించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అరుదైన అంకుడు, తెల్లపొణికి చెట్లను అటవీశాఖ నర్సరీల్లో ప్రత్యేకంగా పెంచి, శాస్త్రీయ పద్ధతిలో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ వుడ్ బ్యాంక్‌లో వెదురు, రోజ్‌వుడ్, టేకు ఉత్పత్తులు ఉంచగా, ఎడ్లబండ్ల తయారీకి ప్రసిద్ధి చెందిన ఏలూరు జిల్లా కాపవరంలో కూడా నూతన వుడ్ బ్యాంక్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ వ్యవస్థ ద్వారా కళాకారుల అవసరాలను క్లస్టర్ల వారీగా అంచనా వేస్తూ నిరంతరాయంగా సరుకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.