Pawan Kalyan: కమిటీ పనితీరు అస్సలు బాలేదు.. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెడతా.. పిఠాపురంలో పవన్ సంచలన వ్యాఖ్యలు!
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పిఠాపురం నియోజకవర్గం స్థానిక జనసేన ఫైవ్ మ్యాన్ కమిటీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Pawan kalyan launches 1500 crore development projects in pithapuram
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం సరికొత్త అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో రూ.1,500 కోట్ల భారీ అంచనాతో చేపట్టనున్న పలు సంక్షేమ, మౌలిక వసతుల పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్వయంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానికులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్, అనంతరం జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో నియోజకవర్గ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. పిఠాపురం పీఠంపై నన్ను కూర్చోబెట్టడం కేవలం ఒక ప్రాంతానికే కాక, మొత్తం ఆంధ్రప్రదేశ్ పురోగతికి మైలురాయిగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
అమిత్ షాతో చర్చలు.. ఉప్పాడ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్:
ఈ ప్రాంతానికి ప్రధాన సమస్యగా మారిన ఉప్పాడ తీరకోతను అరికట్టే రక్షణ గోడ నిర్మాణంపై జనసేనాని ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో స్వయంగా మాట్లాడి ప్రత్యేక అనుమతులు సాధించడం ద్వారా దశాబ్దాల నాటి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశామని వివరించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని సూచించారు. పిఠాపురాన్ని కేవలం పారిశ్రామికంగానే కాకుండా, జాతీయ స్థాయిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడమే తన అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పార్టీ క్యాడర్‌కు హెచ్చరిక.. పిఠాపురంలో పవన్ సొంత ఆఫీస్:
ఇదే వేదికపై స్థానిక జనసేన ఐదుగురు సభ్యుల కమిటీ నడవడికపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చూపించిన కసి, ఆ తర్వాత నాయకులలో తగ్గిపోవడం సరికాదని హితవు పలికారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనులను వేగవంతం చేసేందుకు త్వరలోనే పిఠాపురంలో తన అధికారిక ‘క్యాంప్ ఆఫీస్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై నియోజకవర్గంలో జరిగే ప్రతి చిన్న అభివృద్ధి పనినీ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
