ఏపీలో పెల్రోల్, డీజిల్ కొరతకు కారణాలు ఇవే.. నో స్టాక్ బోర్డుల వెనుక..

Fuel Shortage in AP : రాష్ట్రంలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకులు మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Fuel Shortage in AP

  • ఏపీలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత
  • రాష్ట్ర వ్యాప్తంగా 10శాతం బంకులు మూత
  • పలు బంక్‌లలో నో స్టాక్ బోర్డులు
  • కిలో మీటర్ల కొద్దీ వాహనదారుల క్యూ లైన్లు

Fuel Shortage in AP : ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల వద్ద కిలో మీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తుండగా.. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లు మూత పడుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత సామాన్య ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. విజయవాడ జిల్లా వ్యాప్తంగా ఏకంగా 100కుపైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవటంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశాయి. ఎక్కడైనా కొద్దిపాటి స్టాక్ వచ్చిందన్న సమాచారం తెలిస్తే చాలు.. ఆయా బంకుల వద్దకు వాహనదారులు పరుగులు పెడుతున్నారు.

Also Read : Gold Silver Prices : బంగారం ధరలపై ఆర్బీఐ షాకింగ్ న్యూస్.. వామ్మో అంత పెరుగుతాయా..? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

విజయవాడలోని పలు బంకుల యాజమానులు ఇంధన కొరత నేపథ్యంలో మోటార్ సైకిళ్లకు రూ.300 చొప్పున, ఫోర్ వీలర్లకు రూ.1500 చొప్పున మాత్రమే పెట్రోల్, డీజిల్ కొడుతున్నారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ట్రాఫిక్ నియంత్రణకోసం పోలీసులను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఇంకెంతకాలం ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభ సీజన్ దగ్గర పడుతుంది. ట్రాక్టర్లతో దుక్కులు, ఇతర పనులకు డీజిల్ ఎక్కువ వినియోగం అవుతుంది. ఇలాంటి సమయంలో డీజిల్ కొరత అన్నదాతలకు ఇబ్బందికరంగా మారింది.

ఏపీలో ఇంధన కొరతకు ప్రధాన కారణాలివే..?
ఏపీలో గత రెండుమూడు రోజుల నుంచి ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10శాతం పెట్రోల్ బంకులు మూత పడినట్లు తెలుస్తోంది. ఇంత తీవ్ర స్థాయిలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటానికి పలు కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ కొరత అంటూ ప్రచారం విస్తృతంగా జరగడంతోపాటు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తుది దశ ఎన్నికలు పూర్తయిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా 50శాతానికిపైగా పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగింది. అయితే, ఆ స్థాయిలో ఇంధన సరఫరా లేకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా కొరత తీవ్రమైందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు.. పెట్రోల్, డీజిల్ ను కొందరు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంకుల్లో నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ ను తీసుకెళ్లి బ్లాక్ లో విక్రయాలు చేస్తున్నారని.. అయినా అధికారులు పట్టించుకోవటం లేదని వాహనదారుల నుంచి విమర్శలు ఉన్నాయి.

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో ఇంధన కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకులు మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎస్ సాయి ప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెట్రోల్ బంకుల యాజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని సీఎం అధికారులకు సూచించారు.