Droupadi Murmu: రేపు ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దుర్గమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు.. విజయవాడలో భారీ భద్రత!
రేపు ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పర్యటన దృష్ట్యా కనకదుర్గమ్మ విఐపి దర్శన వేళలు, వాహనాల రాకపోకల్లో అధికారులు మార్పులు చేశారు.
- V Santhosh Kumar
- Published on- October 13, 2026 / 09:32 PM IST
President droupadi murmu visit indrakeeladri kanaka durga temple vijayawada dasara
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (అక్టోబరు 14) విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని సందర్శించనున్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో, కొండపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా భద్రతను అత్యున్నత స్థాయికి పెంచడమే కాకుండా, ఇంద్రకీలాద్రి కొండపై వాహనాల రాకపోకలు, విఐపి, ప్రోటోకాల్ వేళల్లో దేవస్థానం అధికారులు గణనీయమైన మార్పులు చేశారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి వాహనాలు బంద్.. ఉదయం స్లాట్ సమయం పొడిగింపు:
రాష్ట్రపతి(Droupadi Murmu) భద్రతా నియమావళి దృష్ట్యా రేపు మధ్యాహ్నం 1:00 గంటల నుంచి కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేస్తున్నారు. అలాగే మధ్యాహ్నం నుంచి, రాత్రి 7:45 గంటలకు కేటాయించిన ప్రోటోకాల్ దర్శన స్లాట్లను పూర్తిగా రద్దు చేశారు. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో అనుమతులు ఉన్న భక్తులు, ప్రముఖుల సౌకర్యార్థం ఉదయం 6:00 నుంచి 8:00 వరకు ఉండే ప్రోటోకాల్ సమయాన్ని ఒక గంట పెంచి ఉదయం 9:00 గంటల వరకు పొడిగించారు. కావున పాస్‌లు ఉన్నవారు రేపు ఉదయం 6 నుంచి 9 గంటల లోపే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
