Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇక కుండపోత వానలు.. ఈ జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులు.. అధికారుల అత్యవసర హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా భారీ వర్షాలు(Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
- V Santhosh Kumar
- Published on- July 2, 2026 / 11:40 AM IST
Weather warnings issued indicating heavy rains in Andhra Pradesh and Telangana until July 8.
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- జూలై 8 వరకు అలర్ట్
- హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండండి
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జూలై 8వ తేదీ వరకు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని జూలై 3న ఏర్పడే ఈ అల్పపీడనం, క్రమంగా రాజస్థాన్ వైపు పయనిస్తుందని పేర్కొంది. దీనికితోడు రుతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది.
ఈ అల్పపీడన ప్రభావం వల్ల జూలై 4 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు(Rain Alert) ప్రారంభమై, జూలై 5 నాటికి రెండు రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఇప్పటికే మేఘావృతమైన ఆకాశం ఉండగా, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. జూలై 4 నుంచి ఏపీవ్యాప్తంగా వర్షాల తీవ్రత మరింత పెరగనుంది.
మరోవైపు తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. జూలై 8 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.
