AP Rains Alert : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు..

AP Rains Alert : ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలపై అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జి. లక్ష్మీశ సూచించారు.

AP Rains

  • ద్రోణి ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..
  • పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు
  • ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలపై అధికార యంత్రాంగం అలర్ట్

AP Rains Alert : ఏపీలో నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

Also Read : Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం..

ఇవాళ మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతోపాటు.. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉరుములు, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలపై అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 91549 70454 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు వ్యవసాయశాఖ అధికారులు తగిన సూచనలు ఇవ్వాలని అన్నారు. కల్లాల్లో ఉన్న మిర్చి జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడొద్దని ప్రజలకు సూచించారు. చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట నష్టాన్ని అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.