Gymkhana Grounds Fire : చిచ్చుబుడ్డి.. రెండు నిండు ప్రాణాలు తీసింది. ఇద్దరిని సజీవ దహనం చేసింది. విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో అగ్నిప్రమాదానికి చిచ్చుబుడ్డే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారించారు. కంపెనీ క్రాకర్స్ కాకుండా లోకల్ మేడ్ చిచ్చుబుడ్డిలను నిల్వ చేశారని, వాటి వల్లే అగ్నిప్రమాదం జరిగిందని అంచనా వేశారు.
గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్ లోని క్రాకర్స్ షాపుల్లో ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలకు బాణాసంచా పేలి పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. భారీ శబ్దాలతో గ్రౌండ్ చుట్టుపక్కల వాళ్లు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుపడ్డారు.
మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. నాలుగు వైపులా నాలుగు ఫైరింజన్లు పెట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆపరేషన్ స్టార్ట్ చేసిన 20 నిమిషాల్లోనే మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత అగ్నిప్రమాదానికి గురైన షాపులను పరిశీలించారు. ఓ షాపులో ఏసీ షీట్స్ కింద ఇద్దరి మృతదేహాలు గుర్తించారు. మంటల్లో వారు సజీవదహనం అయినట్లు గుర్తించారు.
జింఖానా గ్రౌండ్స్ లో మొత్తం 19 షాపులకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. పక్కాగా ఫైర్ నిబంధనలు పాటించారని నిర్ధారించిన తర్వాతే షాపుల్లో క్రాకర్స్ దిగుమతికి అనుమతి ఇచ్చారు.
ఇద్దరు ఫైర్ సిబ్బంది, ఇద్దరు పోలీసులను జింఖానా గ్రౌండ్స్ లో ఆన్ డ్యూటీలో ఉంచారు. అయితే, పటాసుల దుకాణాల్లో కొన్ని బ్రాండెడ్ క్రాకర్స్ తో పాటు లోకల్ గా తయారు చేసిన క్రాకర్స్ ను కూడా అమ్మకానికి ఉంచారు. స్థానికంగా తయారు చేసిన ఓ చిచ్చుబుడ్డి తీవ్ర ఒత్తిడితో అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది, పోలీసులు అంచనాకు వచ్చారు. మొత్తం 19 స్టాల్స్ లో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక షాపు పాక్షికంగా దగ్ధమైంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు సజీవదహనం కావడం బాధాకరం అన్నారు మున్సిపల్ కమిషనర్ దినకర్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే దుకాణాలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఈ ప్రమాదం తర్వాత విజయవాడ పరిధిలో ఇతర క్రాకర్స్ దుకాణాల్లో భద్రతా చర్యలు మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు.
చిచ్చుబుడ్డి పేలడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా అభిప్రాయపడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. బాధ్యులైన వారిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున స్టాక్ అన్ లోడ్ చేస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని ఆయన వెల్లడించారు. దుకాణంలో రాత్రి పని చేసి నిద్రపోతున్న వారు మరణించారని తెలిపారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామన్నారు.
ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడం వల్లే నష్ట తీవ్రతను తగ్గించగలిగామని ఫైర్ డిపార్ట్ మెండ్ అడిషనల్ డైరెక్టర్ మురళీమోహన్ చెప్పారు. పేలిన చిచ్చుబుడ్డులు లోకల్ మేడ్ కావడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.