Sajjala Ramakrishna Reddy: మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు.. ప్రభుత్వానికి అంత భయమెందుకు.. సజ్జల సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) తీవ్రస్థాయిలో ఆరోపించారు.
- V Santhosh Kumar
- Published on- September 21, 2026 / 04:48 PM IST
Sajjala Ramakrishna Reddy sensational comments on Mega DSC sports quota
Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై చెలరేగిన వివాదం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. టెట్ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇవ్వడం, ఈడబ్ల్యూఎస్ కోటాలో అక్రమాలు చేయడం, నకిలీ సర్టిఫికెట్లతో పోస్టులను అమ్ముకోవడం వంటి అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) తీవ్రస్థాయిలో ఆరోపించారు. కోర్టును ఆశ్రయించిన తర్వాతే ఈ వ్యవహారం బయటకు వచ్చిందని, ఈ నియామక ప్రక్రియపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ పర్యవేక్షణ చూసిన మంత్రులు పదవుల్లో కొనసాగకూడదని, శాంతియుత నిరసనలపై దాడి చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు.
చంద్రబాబుకు సజ్జల సవాల్.. తప్పు చేయకపోతే విచారణకు భయమెందుకు?
ఈ వ్యవహారంలో ఎటువంటి తప్పు జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తే తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని సజ్జల సవాల్ విసిరారు. అక్రమాలు జరగకపోతే లోకేశ్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వ్యాఖ్యానించారు. శాసనమండలిలో ఈ అంశంపై చర్చకు విపక్షాలు కోరినప్పటికీ ప్రభుత్వం ఎందుకు నేరుగా సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు.
శాప్ కార్యాలయం వివాదం.. టీడీపీ కుట్రపూరిత చర్యగా అభివర్ణన:
శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నిరసన తెలిపే రోజే టీడీపీ కార్యకర్తలను, టీచర్లను అక్కడికి పంపించడం వెనుక కుట్ర ఉందన్ సజ్జల ఆరోపించారు. తమపై దాడులకు ముందురోజు నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని, దీనిని వైసీపీ వర్సెస్ ఉపాధ్యాయుల మధ్య గొడవగా చిత్రీకరించే యత్నం సరికాదని హితవు పలికారు.
