తిరుమల వెళ్లినప్పుడు అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ ఇచ్చారు, చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 30మంది చనిపోయారు

  • Publish Date - September 21, 2020 / 12:31 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. విగ్రహాలు విరిగితే నష్టమేంటి అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఇలాంటి భాషను బీజేపీ హర్షించదన్నారు.

ధర్మం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు సోము వీర్రాజు. పుష్కరాల సమయంలో చంద్రబాబు వల్ల 30మంది చనిపోయారని చెప్పారు. 30 గుళ్లను కూల్చిన చంద్రబాబు దేవతా విగ్రహాలను చెత్తకుప్పలో వేశారని మండిపడ్డారు. అన్యమస్తులు ఎవరైనా తిరుమలలో సంతకం చేయాల్సిందే అని సోమువీర్రాజు స్పష్టం చేశారు. తిరుమల వెళ్లినప్పుడు అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ధర్మబద్దంగా వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

తిరుమల శ్రీవారి గుడిలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ పై ఏపీ మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి ప్రశ్నించారు. చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు? ప్రభువును నమ్ముతావా? అని సంతకం అడగలేదని ఆయన చెప్పుకొచ్చారు. డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమేనన్న ఆయన.. ఆ విధానం తీసేయాలన్నారు.

సీఎం హోదాలో వెళ్లే ముఖ్యమంత్రిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్నారు. ఎక్కడా లేని సంప్రదాయం తిరుమలలో మాత్రం ఎందుకు, దాన్ని తీసేయాలంటూ కొడాలి నాని అన్నారు. జగన్ సర్కారు వచ్చినందునే ఇప్పుడు టెస్ట్ చెయ్యాలి….బ్లడ్ తీయాలి అంటున్నారన్న ఆయన.. జగన్ ప్రతిపక్ష నేతగా తిరుమల వెళ్ళినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగలేదని నిలదీశారు. చంద్రబాబు నిష్టదరిద్రుడు.. ముసలి నక్క…… జగన్ ని చూసి చంద్రబాబు కుళ్లి కుళ్ళి ఏడుస్తున్నాడు అంటూ మళ్లీ తిట్ల దండకం అందుకున్నారు కొడాలి నాని.