Arunachalam Special Trains: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్.. ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు.. టైమ్, రూట్, బుకింగ్ వివరాలు ఇవే!
దసరా, దీపావళి, కార్తీక మాస పండగల వేళ అరుణాచలం (Arunachalam Special Trains) వెళ్లే భక్తులకు భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది.
- V Santhosh Kumar
- Published on- September 23, 2026 / 05:31 PM IST
South Central Railway announces special train to Tiruvannamalai for festival season.
Arunachalam Special Trains: దసరా, దీపావళి, కార్తీక మాస పండగల వేళ అరుణాచలం (Arunachalam Special Trains) వెళ్లే భక్తులకు భారతీయ రైల్వే భారీ ఊరటనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురం – తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను (07291/07292) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సర్వీసులు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఇబ్బంది పడకుండా ప్రయాణించేందుకు వీలుగా ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి ముందస్తు అడ్వాన్స్ రిజర్వేషన్లను కూడా రైల్వేశాఖ ప్రారంభించింది.
రైళ్ల వేళలు, ప్రయాణ మార్గం:
నరసాపురం – తిరువణ్ణామలై (07291) రైలు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకు నరసాపురంలో బయల్దేరి, సోమవారం ఉదయం 4:55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై – నరసాపురం (07292) రైలు ప్రతి సోమవారం రాత్రి 8:00 గంటలకు బయల్దేరి, మంగళవారం ఉదయం 10:45 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైళ్లు విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి, వేలూరు మీదుగా ప్రయాణిస్తాయి.
కోచ్‌ల వివరాలు, రెగ్యులర్ సర్వీస్:
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో మొత్తం 23 కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక సెకండ్ ఏసీ, రెండు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, 4 జనరల్ బోగీలు అందుబాటులో ఉంటాయి. కార్తీక మాసంలో గిరిప్రదక్షిణకు వెళ్లే భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నరసాపురం – తిరువణ్ణామలై (07219) ప్రత్యేక రైలును ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నడపనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
