Venkateswara Swamy Temple Netherlands : నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం.. రూ.250 కోట్లతో..3 3.5 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం
Venkateswara Swamy Temple Netherlands : నెదర్లాండ్స్ లో రూ.250 కోట్లతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించబోతున్నారు. దీనికి టీటీడీ సహకారం అందించనుంది.
- Dharani Pilli
- Published On : April 4, 2026 / 09:56 PM IST
ttd br naidu said sri venkateswara swamy temple will be constructed in netherlands
Venkateswara Swamy Temple Netherlands : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. అందుకే కేవలం మన దేశం నుంచే కాక.. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించేందుకు టీటీడీ సిద్ధమయ్యింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీకారం చుట్టింది.
నెదర్లాండ్స్‌లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గాను 33.5 ఎకరాల భూమిని అక్కడి ప్రభుత్వం ‘శ్రీ వసుదైవ కుటుంబం’ సంస్థకు అందజేసినట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వెల్లడించారు. ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిలో.. రూ. 250 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌లో నిర్మించబోయే శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం కోరినట్లు బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు.
ఆలయ గోపురాలు, ప్రాకారాలతో పాటు.. శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించనున్నారని, టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని శ్రీ వసుదైవ కుటుంబం సంస్థ అధ్యక్షులు అశోక్ కుమార్ కోరారని నాయుడు తెలిపారు. ఈ వినతిపై టీటీడీ సానుకూలంగా ఉన్నట్లు చైర్మన్ వెల్లడించారు.
శ్రీ వసుదైవ కుటుంబం (SVK) అనేది నెదర్లాండ్స్‌లో ఉన్న ఒక లాభాపేక్షలేని సంస్థ. ‘ప్రపంచమే ఒక కుటుంబం’ అనే సూత్రం ఆధారంగా భారతీయ సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి ఈ సంస్థ కార్యక్రమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
