TTD Board: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపు ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల.. ఇలా బుక్ చేసుకోండి!
టీటీడీ(TTD Board) ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
- V Santhosh Kumar
- Published on- October 6, 2026 / 04:42 PM IST
TTD to release Rs. 300 special entry darshan tickets for Navaratri Brahmotsavams.
TTD Board: కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Board) శ్రీవారి భక్తుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 11 నుంచి 20 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు:
తిరుమల కొండపై అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో విలాసవంతంగా జరగనున్నాయి. ఈ పవిత్ర మహోత్సవాల సమయంలో దేశ విదేశాల నుంచి విచ్చేసే సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనం అందరికీ సులభంగా అయ్యేలా దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు చేసింది.
వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ దర్శనాలు పూర్తిగా రద్దు:
ఉత్సవాల కాలంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ అక్టోబర్ 11 నుండి 20వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే అక్టోబర్ 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం ఇచ్చే ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులందరూ ఈ విషయాలను గమనించి తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని కోరింది.
