Vadamalapeta Toll Plaza Incident : ఏపీ తమిళనాడు బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్ ప్లాజా దగ్గర నిన్న జరిగిన ఘటనతో తమిళనాట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టోల్ ప్లాజా దగ్గర తమిళనాడు యువ న్యాయవాదులు ఓవర్ చేశారు. దీంతో వారిపై దాడి జరిగింది.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తమిళనాడు లాయర్స్ అసోసియేషన్. తమిళనాడు లాయర్లు గొడవకు దిగుతారనే సమాచారంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అటు తమిళనాడులో ఏపీ రిజిస్ట్రేషన్ తో వాహనాలు అడ్డుకుంటారని వాట్సాప్ గ్రూపుల్లో మేసేజ్ లు సర్కులేట్ అవుతున్నాయి. దీంతో తమిళనాడు పోలీసులను అప్రమత్తం చేశారు ఏపీ పోలీసులు.
తిరుపతి నుంచి చెన్నైకి కొందరు కొందరు తమిళనాడు లా స్టూడెంట్స్ వెళ్తున్నారు. వారు సరిగ్గా వడమాలపేట టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. అయితే, వాళ్ల వెహికల్స్‌కి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌లు పనిచెయ్యలేదు. దాంతో టోల్ చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. ఫలితంగా టోల్ ప్లాజా దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలర్ట్ అయిన టోల్‌ప్లాజా సిబ్బంది.. ట్రాఫిక్ జామ్ అవుతోందని, త్వరగా టోల్ చెల్లించాలని కోరారు. దాంతో రెచ్చిపోయిన యువకులు.. టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. దాడికి తెగబడ్డారు విద్యార్థులు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
వీరి అత్యుత్సాహం కారణంగా గంటకు పైగా వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దాంతో సహనం కోల్పోయిన వాహనదారులు, స్థానికులు.. ఆ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా వారిపైనా దురుసుగా ప్రవర్తించారు. టోల్ సిబ్బంది, వాహనదారులపై దాడి చేశారు. ఈ ఘర్షణపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు స్పాట్‌కు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రా తమిళనాడు సరిహద్దు దగ్గర ఒక రకమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వడమాలపేట టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా సిబ్బందికి, తమిళనాడుకి చెందిన యువ న్యాయవాదులకు మధ్య ఒక చిన్న పాటి గొడవ..చివరకు పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ వ్యవహారం.. టోల్ ప్లాజా సిబ్బంది, మొత్తం గ్రామస్తులు అంతా కలిసి న్యాయవాదులను చితక్కొట్టి తరిమి తరిమి కొట్టి అక్కడి నుంచి పంపేశారు. తీవ్ర అవమానంతో తమిళనాడుకి వెళ్లిన యువ న్యాయవాదులు.. యంగ్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులను సంప్రదించారు. తమకు చాలా అన్యాయం జరిగిందంటూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో యంగ్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులంతా ఇదే టోల్ ప్లాజాకు వస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. తమిళనాడు నుంచి ఏపీలోకి వచ్చే చెక్ పోస్టుల దగ్గర వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. స్వయంగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సైతం బోర్డర్ లో కాపలా కాస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ కూడా ఏపీలోకి ఎంటర్ కాలేదని తెలుస్తోంది.