Vangaveeti Radha Krishna : ఈ గెలుపు నాది కాదు.. వారందరిదీ.. మేయర్‌గా ఘనవిజయం తరువాత వంగవీటి రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు
Vangaveeti Radha Krishna : విజయవాడ మేయర్‌గా తనకు అవకాశం కల్పించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వంగవీటి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- November 4, 2026 / 02:41 PM IST
Vangaveeti Radha Krishna Comments On Pawan Kalyan Chandrababu After Victory as Vijayawada Mayor
Vangaveeti Radha Krishna : విజయవాడ మేయర్‌గా తనకు అవకాశం కల్పించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వంగవీటి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా తన విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు.
Also Read – Jagapathi Babu Sister : గుంటూరు మేయర్‌గా సినీ నటుడు జగపతిబాబు చెల్లెలు ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే?
విజయవాడ మేయర్ గా ఘన విజయం సాధించిన వంగవీటి రాధాకృష్ణ బుధవారం టీడీపీ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు తనకు అండగా నిలిచారని తెలిపారు. విజయవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులందరినీ కలుపుకుని నగరంలోని సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరూ విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రతి కార్పొరేటర్ సవాలుగా తీసుకుని పనిచేశారని వంగవీటి రాధా అన్నారు. ఇది నా విజయం కాదు.. విజయవాడ ప్రజల విజయం అని చెప్పారు.
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణకు ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. మొత్తం 86 వార్డుల్లో ఎనిమిది మినహా మిగిలిన అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారని, తొలుత 76 డివిజన్లలో గెలుస్తామని అంచనా వేసినప్పటికీ, 78 స్థానాల్లో విజయం సాధించామని అన్నారు.
తక్కువ శాతం ఓటింగ్ నమోదైనప్పటికీ ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించారని కేశినేని చిన్ని అన్నారు. ఓటింగ్ శాతం మరింత పెరిగి ఉంటే రెండు లక్షలకు పైగా మెజారిటీ వచ్చేదని అభిప్రాయపడ్డారు. ఈ విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందని, ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈవీఎంలతో ఎన్నికలు జరిగినా, బ్యాలెట్ విధానంలో జరిగినా ప్రజల మద్దతు కూటమికేనని ఈ ఫలితాలు నిరూపించాయన్నారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు వంగవీటి రాధాకృష్ణకు మద్దతు తెలిపారని అన్నారు. కూటమిలో సీట్ల పంపిణీ నిర్ణయం ఆలస్యం కావడం వల్ల కొన్ని స్థానాల్లో నష్టం జరిగిందని, మరికొన్ని కారణాలతో మూడు, నాలుగు సీట్లు కోల్పోయామని వివరించారు.
ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు ఎవరైనా మంచి సూచనలు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైసీపీతో పాటు ఇతర పక్షాలు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.
