Weather Updates: ఎండల్లో హాయ్ హాయ్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

అసలు ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లబడుతుందని, ఎండల నుంచి కొంత ఉపశమనం పొందొచ్చని జనాలు భావిస్తున్నారు.

  • Published On : March 15, 2026 / 06:37 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భిన్నమైన వాతావరణం
  • ఓవైపు ఎండలు, మరోవైపు మేఘావృతం
  • పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

 

Weather Updates: అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు భారీ పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఎండల ధాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు. సమ్మర్ స్టార్టింగ్ లోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు మరెంత దారుణంగా ఉంటుందోనని భయపడిపోతున్నారు.

కాగా, మండు టెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) చల్లటి కబురు అందించింది. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు మేఘావృతమై విభిన్న వాతావరణం నెలకొననున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ పేర్కొంది.

అలాగే అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంది.

పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసిన విపత్తుల నిర్వహణ సంస్థ.. ప్రజలను అప్రమత్తం చేసింది. పలు జాగ్రత్తలు చెప్పింది. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్థంబాల కింద నిలబడరాదని హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లోనే తల దాచుకోవాలని సూచించింది.

అసలు ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే వాతావరణం చల్లబడుతుందని, ఎండల నుంచి కొంత ఉపశమనం పొందొచ్చని జనాలు భావిస్తున్నారు.