విశాఖలో మరో దారుణం : ఉద్యోగం పేరుతో వ్యభిచారం

  • Publish Date - June 15, 2020 / 05:40 AM IST

విశాఖపట్నంలో ఇటీవల హత్యకు గురైన దివ్య కేసు మరువక ముందే అదే తరహాలో మరో మహిళను ఉద్యోగం పేరుతో వ్యభిచారం కూపంలోకి లాగిన వైనం వెలుగు చూసింది. కృష్ణాజిల్లా గుడివాడ ధనియాల పేటకు చెందిన ఓ యువతి(19) చదువు మధ్యలో ఆపేసి ఒక కిరాణా షాపులో పని చేసేది. ఈ ఏడాది జనవరి 1న తల్లితో గొడవపడి, కలువపూడిలోని తాతగారింటికి వెళ్లేందుకు రైలెక్కింది.  

గుడివాడ రైల్వే స్టేషన్లో ఒక రైలు బదులు ఇంకో రైలు ఎక్కే సరికి చివరకు తిరుపతి చేరుకుంది. అక్కడ రైల్వే స్టేషన్లో విశాఖపట్నానికి చెందిన బి.ఉమామహేశ్వరి అనే మహిళతో పరిచయం అయ్యింది. విశాఖలో పని ఇప్పిస్తానని చెప్పటంతో ఆ యువతి ఉమామహేశ్వరితో విశాఖకు వచ్చింది. మధురవాడ వాంబేకాలనీలో తన ఇంటికి తీసుకువచ్చిన ఉమామహేశ్వరి తన బంధువుతో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది.

అందుకు ఆ యువతి ఒప్పుకోక పోవటంతో…అతను తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి ఉమామహేశ్వరి  ఈవిషయాన్ని తన మరదలు గౌరీ లక్ష్మికి చెప్పింది. దీంతో తన చెల్లెలు కుమారి వద్ద పని ఉందని చెప్పి అక్కడకు పంపించింది. ఆమె కూడా ఈ యువతితో బలవంతంగా వ్యభిచారం చేయించింది.

ఇక్కడ ఆ యువతి వద్దకు వాసిరెడ్డి సతీష్ అనే విటుడు వచ్చాడు.  తాను పోలీసునని పరిచయం చేసుకున్నాడు. దీంతో తనను ఈ నరకం నుంచి బయటపడేయమని ఆ బాధితురాలు వేడుకుంది. దీంతో  బాధితురాలిని అక్కడ్నించి  తీసుకు వెళ్లి గాజువాకలోని అఫీషియల్ కాలనీకి చెందిన గంట నాగమణి, బి.గోవింద్ ల ఇంటికి తీసుకువెళ్ళి రెండురోజులు ఉంచాడు.

అతర్వాత ఆమెను పెళ్లి  చేసుకుంటానని నమ్మించి వేరే ఇల్లు తీసుకుని ఆమెను  శారీరకంగా అనుభవిస్తూ,  వ్యభిచారం చేయించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వ్యభిచార కూపంలోకి దింపటంతో..ఎదురు తిరిగి ప్రశ్నించింది. ఆమె నుంచి పెళ్ళి చేసుకోమని ఒత్తిడి ఎక్కువవ్వటంతో  ఆమెకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను వదిలి పెట్టి వెళ్లిపోయాడు.

చివరకు అతను నర్సీపట్నంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లగా… అక్కడ గంటా నాగమణి, గోవింద్ లతో కలిసి అతను ఆమెను కొట్టి వదిలి వెళ్లి పోయారు. ఆరోజు రాత్రికి ఒకఇంట్లో తలదాచుకున్న యువతి మర్నాడు తన తల్లితండ్రులకు ఫోన్ చేసి తాను కాకినాడలో  ఉన్నానని ఫోన్ చేసి చెప్పి  వారి వద్దకు వెళ్లిపోయింది. ఇంటికి చేరుకున్నతర్వాత గత5 నెలలుగా తాను పడిన కష్టాలను తల్లితండ్రులకు వివరించింది.

వారి సహకారంతో ఆదివారం జూన్ 14న గాజువాక  పోలీసు స్టేషన్ కు వచ్చి తాను పడిన కష్టాలపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు  ఉమామహేశ్వరి, కుమారి, నాగమణితోపాటు సతీష్‌ను, అతడికి సహకరించిన గోవింద్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.