Vizag Steel Plant : ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ.. మా ప్రభుత్వం వచ్చాక రూ. కోటి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం..!
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రమాద బాధితులకు రూ. కోటి పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
- Sreehari A
- Updated on- June 10, 2026 / 03:59 PM IST
Vizag Steel Plant Ys Jagan Mohan Reddy
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ. కోటి పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. బుధవారం (జూన్ 10)న విశాఖలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తీరు చాలా విచారకరమన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు (Vizag Steel Plant) కోటి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బాధిత కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలన్నారు. బాధితులకు అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. అలాగే, మృతిచెందిన కార్మిక కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి స్టీల్ ప్లాంట్‌లో 28వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. రెండేళ్లలో 10,500 మంది ఉద్యోగులను తొలగించారని విమర్శించారు. ఉపాధి కోల్పోవడంతో ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Gold Price Today June 10 : కుప్పకూలిన బంగారం ధరలు.. వెండి ఢమాల్.. ఏపీ–తెలంగాణలో ఈరోజు తులం రేట్లు ఎంతంటే?
వైఎస్సార్‌సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్ విద్యుత్‌కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లమని చెప్పారు. కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50పైసలకు పెంచారని వైసీపీ అధినేత మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేశ్ పై మండిపాటు :
ఇంత ప్రమాదం జరిగితే కనీసం మానవత్వం చూపించాల్సిన ప్రభుత్వం ఇలా వ్యవహరించడం బాధకరమన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంలో పెద్ద డ్రామా చేశారంటూ ఆరోపించారు.
మృతుల కుటుంబాలకు స్టీల్‌ప్లాంట్ ఫ్యాక్టరీ నుంచి రూ25 లక్షల ఇస్తుంటే.. కూటమి ప్రభుత్వం పెద్దగా ఇచ్చిందేముందని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటన బాధితులకు రూ. కోటి పరిహారం ఇప్పించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోతే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాధితులకు తప్పకుండా రూ. కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.
