YS Jagan-Mudragada : ముద్రగడ మరణం తీరని లోటు.. పితృసమానుడిని కోల్పోయాం: వైఎస్ జగన్
YS Jagan-Mudragada : ముద్రగడ మరణం తీవ్రంగా కలిచివేసిందంటూ వైఎస్ జగన్ తన సంతపాన్ని తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.
- Sreehari A
- Published on- July 14, 2026 / 08:52 PM IST
YS Jagan-Mudragada
YS Jagan-Mudragada : కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం మరణం తనను ఎంతో తీవ్రంగా కలచివేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించిన ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు (YS Jagan-Mudragada) చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, అభిమానులకు ఇది తీరని లోటుగా పేర్కొంటూ, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ప్రార్థించారు.
ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘నాకు పితృసమానులు.. ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది’ అంటూ తన సంతాపాన్ని తెలియజేశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ముద్రగడ కోలుకుంటున్నారనే వార్తలు ఎంతో ధైర్యాన్నిచ్చాయని, పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు.
Read Also : Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు..!
ముద్రగడ 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు విశిష్ట సేవలు అందించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావిస్తూ జీవితాంతం పేదల సంక్షేమం కోసమే ఆయన కృషి చేశారని పేర్కొన్నారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచారు. వారి హక్కులు, సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారంటూ జగన్ కొనియాడారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, నిజాయితీ ముద్రగడను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని మాజీ సీఎం చెప్పారు.
ముద్రగడ పద్మనాభం మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి కూడా తీరని లోటుగా జగన్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. అలాగే, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్ ఘన నివాళులు అర్పించారు.
