YS Jagan-Arnab Cyclone : తుపాను బాధిత రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా? చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ఫైర్‌!

YS Jagan-Arnab Cyclone : తుపాను నష్టంపై వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, రైతులకు పరిహారం అందించాలని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

YS Jagan Mohan Reddy

  • అర్నబ్ తుపాను నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు..
  • రైతుల కన్నీరు ఆగలేదు.. చంద్రబాబు పబ్లిసిటీ ఆపడంలేదు..
  • సీసీ కెమెరాలతో పంట నష్టాన్ని ఎలా గుర్తిస్తారు?
  • ఆర్టీజీఎస్‌లో కూర్చుంటే పంట నష్టం తెలుస్తుందా?

YS Jagan-Arnab Cyclone : తుపాను దెబ్బకు రైతులు విలవిలలాడుతుంటే.. పంట నష్టాన్ని సరిగ్గా అంచనా వేయకుండా ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

తుపాను నుంచి ఇంకా ఏపీ ప్రజలు కోలుకోలేదని, రైతుల కన్నీరు (YS Jagan-Arnab Cyclone) ఆగలేదని వాపోయారు. ఇలాంటి తుపాను ప్రభావ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ ఆపడం లేదని మండిపడ్డారు. రైతులకు అండగా నిలబడి పొలాల్లోకి వెళ్లి వారి కష్టాలను తెలుసుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలవాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు.

50శాతం దిగుబడి రావడం కష్టమే :
అర్నబ్ తుపాను ప్రభావంతో కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో వ్యవసాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం కనిపిస్తోందని, వరి పంట నేలకొరిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. మిగిలిన పంటలోనూ 50శాతం దిగుబడి వస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. కొబ్బరి, అరటి తోటలు, ఆక్వా రంగం కూడా దెబ్బతిన్నాయని వివరించారు.

సీసీ కెమెరాలు, ఆర్టీజీఎస్‌ గణాంకాలతోనే పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని జగన్ ప్రశ్నించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గుర్తించాలని సూచించారు. విద్యుత్ సరఫరా లేక ఆక్వా రైతులు జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.

Read Also : KTR – Chandrababu: ఏపీలో కరవు లేదు.. తెలంగాణలోనే ఎందుకు? చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు!

అన్నీ కంటితుడుపు చర్యలే :

వరి రైతుకు ఎకరాకు రూ.40 వేల వరకు, అరటి రైతుకు రూ.2 లక్షల వరకు, ఆక్వా రైతుకు రూ.4నుంచి రూ. 5 లక్షల వరకు నష్టం వస్తోందని జగన్ పేర్కొన్నారు. గత తుపాను నష్టాలకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీ, ప్రస్తుత నష్టపరిహారంపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబువి అన్నీ కంటితుడుపు చర్యలేనని వైఎస్ జగన్ విమర్శించారు.

ఇదే సమయంలో బియ్యం ధరలు భారీ పెంచేశారని, కిలోకు రూ.85 నుంచి రూ. 90 వరకు చేరుతున్నాయని, బియ్యం నిల్వలు, ఎగుమతుల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీజ్ ది షిప్ అన్నవారు సీజ్ లేదు.. షిప్ లేదని ఎద్దేవా చేశారు.

రైతులకు న్యాయం జరిగేవరకు.. :
బియ్యాన్ని బ్లాక్ చేసి ఎక్స్ పోర్టు చేస్తున్నది అంతా టీడీపీ నేతలేనని, మంత్రి, ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాలనలో సామాన్యులు ఎలా బతుకుతారని, అందుకే రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలని, బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు వారి పక్షాన నిలవాలని జగన్ పిలుపునిచ్చారు.

రైతుల తరపున మద్దతు పలకాల్సిందిగా సూచించారు. బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో రైతుల తరఫున నిలబడాలన్నారు. ఇప్పటివరకూ తుపాను కారణంగా 8 మందికిపైగా చనిపోయారని, మరి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి? అని ప్రశ్నించారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని వైఎస్ జగన్ విమర్శలు చేశారు.