YS Sharmila Daughter Marriage : వైఎస్ షర్మిల కుమార్తె నిశ్చితార్ధం, వివాహం, రిసెప్షన్ తేదీలు ఇవే.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి శుభలేఖ
YS Sharmila Daughter Marriage : వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహ తొలి శుభలేఖను కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
- Harish Thanniru
- Updated on- September 18, 2026 / 02:38 PM IST
YS Sharmila
YS Sharmila Daughter Marriage Date : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో మరో శుభకార్యానికి తేదీ ఖరారైంది. వైఎస్ షర్మిల – అనిల్ దంపతుల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం సోమల రఘురామ్ రెడ్డితో నిశ్చమైన విషయం తెలిసిందే. అయితే, నిశ్చితార్ధం, వివాహం, రిసెప్షన్ తేదీలను వైఎస్ షర్మిల సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల వివాహ తొలి శుభలేఖను కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌తోపాటు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, వైఎస్ అంజిలిరెడ్డి, రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు, షర్మిల కొడుకు, కోడలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షర్మిల ఎక్స్ (ట్విటర్) వేదికగా పంచుకున్నారు.
వైఎస్ షర్మిల ట్వీట్ ప్రకారం.. దివంగత వైఎస్సార్ ఆశీస్సులతో అంజిలి రెడ్డి-సోమల రఘురామ్ రెడ్డిల వివాహం జరగడం తమ కుటుంబానికి ఎంతో సంతోషకరమైన సందర్భమని తెలిపారు. ఇరువురి కలయిక దైవ సంకల్పమని, వారి నూరేళ్ల వైవాహిక జీవితానికి ఇది శుభారంభమని పేర్కొన్నారు. ఈనెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న వివాహం, డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మూడు శుభకార్యాల సమాచారాన్ని దేవుడి ఆశీస్సులతో వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి పంచుకోవడం ఆనందంగా ఉందని షర్మిల తెలిపారు.
కాబోయే నూతన వధూవరులు అంజిలి రెడ్డి, రఘురామ్ రెడ్డిల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి తొలి వివాహ ఆహ్వాన పత్రికను రఘురామ్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్సార్ ఆశీస్సులు తీసుకోవటం జరిగిందని తెలిపారు. వైఎస్సార్ దీవెనలు తమ పిల్లల జీవితాలకు కొండంత అండగా నిలుస్తాయని, ఆయన చూపిన సన్మార్గం ఎల్లప్పుడూ వారికి ఆదర్శంగా ఉంటుందని షర్మిల పేర్కొన్నారు.
నాన్న స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిశుద్ధ వివాహ మహోత్సవం YSR కుటుంబంలో మరో సంతోషకరమైన క్షణం. ఇరువురి కలయిక దైవ సంకల్పం. నూరేళ్ల జీవితానికి శుభారంభం.
ఈ నెల 24న నిశ్చితార్థం, నవంబర్ 25న పరిణయం, అలాగే… pic.twitter.com/nibFyREPiY
— YS Sharmila (@realyssharmila) September 18, 2026
