YS Sharmila : జగన్ బాటలోనే షర్మిల.. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందో తెలుసు కదా అంటూ చురకలు

YS Sharmila : వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన టీడీపీని ఉద్దేశించి షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ys sharmila Slams tdp over comments her father ysr grand father raja reddy

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం వరకు తన అన్న, మాజీ సీఎం వైఎస్ జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా స్వరం మార్చారు. తాజాగా జగన్ బాటలోనే నడిచారు షర్మిల. ఈ లోకంలో లేని తన తాత, తండ్రిపై టీడీపీ చేస్తున్న విష ప్రచారంపై ఆమె మండిపడ్డారు. వారు వచ్చి సంజాయిషీ ఇవ్వలేరనే ధైర్యంతో అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా షర్మిల సుదీర్ఘ పోస్ట్ చేశారు.

‘‘మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాత రాజారెడ్డి ఈ లోకంలో లేరు. సంజాయిషీ ఇచ్చుకోలేని వారిని టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయటపెట్టింది. నిజంగా మా తాత, తండ్రి అంత దుర్మార్గులే అయితే ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారి మీద ఎందుకు విచారణ జరపలేదు? వారిని ఎందుకు శిక్షించలేదు? అప్పుడు మీకు చేతకాలేదా?’’ అని షర్మిల ప్రశ్నించారు.

‘‘రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ రెండేళ్ల కాలంలో పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు లేకనే కదా ఇప్పుడు మా నాన్న, తాతల మీద విమర్శలు? సొంతగా ఎదిగే సత్తా లేక, పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు మరణించిన వారిని లాగి టీడీపీ చేస్తున్నవి నీచ రాజకీయాలు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మీరు ఉత్తములు అయిపోరు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో రెండేళ్లుగా అధ్వాన్న పాలన చేసే అపర మేధావులు తెలుసుకోవాలి’’ అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘సీమలో జరిగిన అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి వైఎస్ రాజారెడ్డి. కడప ప్రజల కోసం ఆయన ఆ కాలంలోనే అంటే 1973లోనే 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీని, పాలిటెక్నిక్ కళాశాలను కట్టించి ఉచిత విద్యను అందించిన మహానుభావుడు. ఎంతో మంది పేదల జీవితాలను నిలబెట్టిన మహా మనిషి. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి, తప్పుగా చిత్రీకరిస్తే రాయలసీమ ప్రజలు ఏమాత్రం హర్షించరు’’ అన్నారు షర్మిల.

‘‘సంక్షేమం, అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పార్టీలకు అతీతంగా, మన, పర అనే భేదం లేకుండా పాలన చేసిన మహనీయుడు YSR. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్ లాంటి పథకాలు YSRకే సాధ్యమయ్యాయి. పోలవరాన్ని మొదలుపెట్టి 33 శాతం పనులు 5 ఏళ్లలో పూర్తి చేస్తే, తర్వాత రెండు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గారికి మిగతా పనుల పూర్తికి చేతకాలేదు. రుణమాఫీకి చేతకాలేదు. మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేతకాలేదు. ప్రతి నెలా మహిళలకు 1500 రూపాయలు ఇవ్వడానికి చేతకాలేదు’’ అంటూ ఎద్దేవా చేశారు.