Sajjala Ramakrishna Reddy : ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే అధికారం వారికే ఉంది : సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Updated on- May 31, 2026 / 02:57 PM IST
ysrcp sajjala ramakrishna reddy comments chandrababu over women reservations
- కూటమి పాలనపై వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం
- చంద్రబాబు ప్రభుత్వ మోసానికి రెండేళ్లు కార్యక్రమం
- పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
Sajjala Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా సరే.. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, దీని గురించి మహానాడు సాక్షిగా అబద్ధాలు చెప్పారంటూ వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ‘చంద్రబాబు ప్రభుత్వ మోసానికి రెండేళ్లు’ అనే అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మహిళా మంత్రులు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ రెండేళ్ల అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ రాబోయే పది రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు సాగించింది వ్యవస్థీకృత అరాచక పాలన. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అత్యధికంగా మోసపోయింది మహిళలే. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన ఐదేళ్ల పాలనలో మహిళలకు పెద్దపీట వేశారు. జగన్ కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలను కూడా పీకేశాడు. ఇలా మోసం చేయడమే కాకుండా పుండుమీద కారం చల్లుతున్నారు. చంద్రబాబుకు, జగన్‌కు ఎంతో వ్యత్యాసం ఉంది’’ అన్నారు.
*పలవరం ఎమ్మెల్యేకి పవన్ కల్యాణ్ 4 వారాల డెడ్‌లైన్.. ఆంతర్యమేంటి?
‘‘చంద్రబాబు ఈ రెండు సంవత్సరాల పాలనలో ఎక్కువ మోసపోయింది మహిళలే కాబట్టి, ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసే పూర్తి అధికారం మహిళలకే ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే ఘనత అని చంద్రబాబు చెప్పుకుంటే.. మరి గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్లను ఏమనాలి? జగన్ హయాంలోనే మహిళలకు సరైన సంక్షేమం, భద్రత అందాయని’’ ఆయన తెలిపారు.
*బాబోయ్.. బాలయ్య కూతుర్లో ఇంత ట్యాలెంట్ ఉందా.. డ్యాన్స్ అదరగొట్టిన తేజస్విని.. వీడియో వైరల్..
‘‘ఎన్నికల ముందు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక నెలకు రూ.1500 ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటున్నారు. ఒక మాఫియా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలనే దానికి ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోంది. వైఎస్ జగన్.. చంద్రబాబుకు గొడ్డలిలా కనిపిస్తున్నాడు. తనను రాజకీయంగా సమాధి చేయగల శక్తి కేవలం జగన్‌కే ఉందని చంద్రబాబుకు భయం. అందుకే పదే పదే గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఈ రెండేళ్లలో జరిగిన దోపిడీని ప్రజలకు మనం క్లియర్ గా వివరించాలి. అలాగే మాకు ఇచ్చిన హామీల సంగతి ఏంటని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడినా ప్రజలు నిలదీయాలని’’ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
