CM Jagan : పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలూ నాలుగే- పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ సెటైర్

ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయినంత చులకన.

CM Jagan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం జగన్. ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అని పవన్ ని సంబోధించారు. మరోసారి పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు ముఖ్యమంత్రి జగన్. పెళ్లిళ్లే కాదు నియోజకవర్గాలూ నాలుగే అంటూ పవన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు జగన్. కాకినాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

”దత్తపుత్రుడికి చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యం. బాబు సిట్ అంటే సిట్టు.. స్టాండ్ అంటే స్టాండ్.. జగన్ ను తిట్టు అంటే తిట్టు.. కొట్టు అంటే కొట్టు.. ఎక్కడ నిలబడితే బాబుకు ప్రయోజనం కలుగుతుందంటే అక్కడ నిలబడతాడు. దత్తపుత్రా నీకు ఇచ్చేది 80 కాదు 20యే అంటే.. దానికి కూడా జీహుజూర్ అంటాడు. ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి.

రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకి అమ్మేయగలను అనే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడు. ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయినంత చులకన.

ఇంతకుముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక.. మూడయ్యాయి. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజీ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిల్లే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన చంకలో ఉన్న పిలిని పిఠాపురంలో వదిలాడు” అంటూ చంద్రబాబు, పవన్ లపై విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్.

ఇక ఈ ఎన్నికలు పెత్తందారుల దోపిడీకి, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ అన్నారు. వైసీపీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని, చంద్రబాబుకి ఓటు వేస్తే స్కీములన్నీ ముగిసిపోతాయన్నారు. సచివాలయాల సేవలకు ముగింపు పలుకుతారని, మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వస్తాయని హెచ్చరించారు జగన్. దోచుకోవడం, పంచుకోవడం చంద్రబాబు నైజమని.. వాళ్లు గెలిస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుందని, ఐదేళ్లు రక్తం తాగుతారని సీఎం జగన్ అన్నారు.

దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలన్నది కూడా చంద్రబాబు నిర్ణయించారని జగన్ అన్నారు. దత్తపుత్రుడే కాదు వదినమ్మ కూడా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్. మరిది మాటే వేదం అన్నట్లుగా చంద్రబాబు చెప్పినట్లుగా బీజేపీలో టికెట్లు ఇస్తుందని, అలాగే పార్టీలు మారుస్తుందని విమర్శించారు. బీఫామ్ ఏ పార్టీదైనా యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే అంటూ ఘాటు విమర్శలు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల తర్వాత చంద్రబాబు మ్యానిఫెస్టో కనిపించదన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరైనా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు కూటమి తనపై గులకరాళ్లు వేయిస్తోందని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు.

 

Also Read : చంద్రబాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు