Blue Moon 2026 : ఆకాశంలో అద్భుతం.. బ్లూ మూన్.. అంటే ఏంటి.. ఎప్పుడు కనిపిస్తుంది అంటే..

Blue Moon 2026 : మే 31న ఖగోళంలో అద్భుతం కనిపించబోతుంది. అదే బ్లూ మూన్. అంటే..

Rare Blue Moon to light up skies this 2026 May 31 Full details here

Blue Moon 2026 : అరుదైన ఖగోళ దృగ్విషయానికి మే 31 వేదిక కానుంది. ఇంతకీ ఆ రోజు ఏం జరగనుంది అంటే.. ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ వింత కనిపించబోతోంది. ఇంతకీ అది ఏంటంటే.. బ్లూ మూన్ (Blue Moon). పేరు వినగానే చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడేమో అనుకుంటే పొరపాటే. బ్లూ మూన్ అంటే.. ఒకే క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణమిలు వస్తే.. అందులో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. మే నెలలో 1వ తారీఖున ఒక పౌర్ణమి రాగా.. మళ్లీ మే 31న ఇంకో పౌర్ణమి రాబోతోంది. దీన్ని బ్లూ మూన్ అంటారు. ఈ ఖగోళ మార్పు కారణంగా సాధారణంగా ఏడాదికి వచ్చే 12 పౌర్ణమిలకు బదులుగా, 2026 సంవత్సరంలో మొత్తం 13 పౌర్ణమిలు రానున్నాయి.

బ్లూ మూన్ ఎందుకు ఏర్పడుతుంది

 చాంద్రమాన చక్రం (Lunar cycle), మన క్యాలెండర్ సంవత్సరంతో పూర్తిగా సరిపోకపోవడం వల్లే బ్లూ మూన్ ఏర్పడుతుంది. సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి పట్టే కాలాన్ని ఒక రోజుగా లెక్కిస్తాము. అలాగే భూమి.. సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలాన్ని ఒక సంవత్సరంగా లెక్కిస్తాము. అలానే భూమి చుట్టూ చంద్రుడు తిరిగే కక్ష్యను బట్టి ‘నెల’ అనేది ముడిపడి ఉంటుంది. వాస్తవానికి అయితే ప్రతి నెలలో ఒక్కటే పౌర్ణమి వస్తుంది. కానీ అరుదుగా మాత్రమే ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తాయి. దీనిలో రెండో దాన్ని బ్లూ మూన్ అంటారు.

అలాగే ప్రకృతిలో వచ్చే కాలమార్పులను బట్టి చాలా పౌర్ణమిలకు సాంప్రదాయబద్ధమైన పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఫిబ్రవరిలో వచ్చే పౌర్ణమిని ‘స్నో మూన్’ (Snow Moon) అని, జూన్‌లోని పౌర్ణమిని ‘స్ట్రాబెర్రీ మూన్’ (Strawberry Moon) అని, డిసెంబర్‌లోని పౌర్ణమిని ‘కోల్డ్ మూన్’ (Cold Moon) అని పిలుస్తారు.

బ్లూ మూన్ ఎన్ని రకాలు

 ఖగోళ శాస్త్రవేత్తలు బ్లూ మూన్‌ను రెండు రకాలుగా వర్ణించారు. ఒకటి నెలవారీ వచ్చే బ్లూ మూన్ (Monthly Blue Moon). అంటే పైన చెప్పుకున్నట్లు ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తే.. రెండో పూర్ణిమను బ్లూ మూన్ అంటారు. 2026, మే నెలలో మనం చూడబోయే బ్లూ మూన్ కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది.

ఇక రెండోది సీజనల్ బ్లూ మూన్ (Seasonal Blue Moon). సాధారణంగా ఒక సీజన్ (ఖగోళ త్రైమాసికం) లో మూడు పౌర్ణమిలు ఉండాలి. కానీ ఏదైనా ఒక సీజన్‌లో నాలుగు పౌర్ణమిలు వస్తే, అందులో మూడవ పౌర్ణమిని సీజనల్ బ్లూ మూన్ అంటారు. ఇది కూడా ఇటువంటి ఒక అరుదైన కేటగిరీకి చెందినదే.

బ్లూ మూన్ తేదీ, సమయం

2026 సంవత్సరంలో మే 31, ఆదివారం నాడు బ్లూ మూన్ కనిపించనుంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం మే 31, రాత్రి 8:45 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం జూన్ 1 తెల్లవారుజామున) ఈ బ్లూ మూన్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మే 31 రాత్రి నుంచే భారతీయులు ఈ బ్లూ మూన్‌ను చూడవచ్చు. అయితే 2026 మే నెలలో కనిపించే బ్లూ మూన్‌లో మరో వింత కూడా ఉంది. ఆ రోజు కనిపించేది ‘మైక్రో మూన్’ (Micro Moon). అంటే చంద్రుడు భూమికి తన కక్ష్యలో అత్యంత దూరంగా ఉంటాడు. అందువల్ల ఈ బ్లూ మూన్ నాడు చంద్రుడు సాధారణం కన్నా కొంచెం చిన్నగా కనిపిస్తాడు. టెలిస్కోపులు అక్కర్లేకుండానే ప్రతి ఒక్కరూ ఈ బ్లూ మూన్‌ను వీక్షించవచ్చు.

చంద్రుడు నిజంగా నీలంగా కనిపిస్తాడా..

సాధారణంగా కనిపించడు. అయితే, అగ్నిపర్వతాలు పెద్ద ఎత్తున బద్దలైనప్పుడు లేదా భారీ కార్చిచ్చులు (అడవి మంటలు) సంభవించినప్పుడు వాతావరణంలోకి విడుదలయ్యే నిర్దిష్ట పరిమాణంలోని పొగ, ధూళి కణాలు కాంతిని వడపోస్తాయి. అలాంటి అరుదైన పరిస్థితుల్లో మాత్రమే చంద్రుడు మన కంటికి నిజంగానే నీలి రంగులో కనిపించే అవకాశం ఉంది.