Blue Moon 2026 : ఆకాశంలో అద్భుతం బ్లూ మూన్.. మూడేళ్ల తర్వాత ఇప్పుడే.. భారత దేశంలో ఎప్పుడు కనిపిస్తుంది అంటే..!

Blue Moon 2026 : ఆకాశంలో అద్భుతం కనిపించబోతుంది. అదే బ్లూ మూన్. మరి ఎప్పుడు.. ఎక్కడ కనిపిస్తుంది అంటే..

Rare Blue Moon To Light Up The Sky Tonight here is Best Time To Watch it in india

Blue Moon 2026 : మే 31 ఆదివారం నాడు ఆకాశంలో అద్భుతమైన ఖగోళ దృగ్విషయం కనిపించబోతుంది. ఇంతకీ ఆ వింత ఏంటంటే.. అరుదైన బ్లూ మూన్ దర్శనం కాబోతుంది. రెండున్నర, మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఈ వింత మనకు కనిపిస్తుంది. ఈ సారి ఈ అరుదైన ఖగోళ దృశ్యం భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కనిపించనుంది. ఈ ఏడాది వచ్చే బ్లూ మూన్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది బ్లూ మూన్‌తో పాటు ‘మైక్రోమూన్’ (Micromoon) కూడా కానుంది. అంటే ఈ సమయంలో చంద్రుడు భూమికి సాధారణం కంటే కొంచెం ఎక్కువ దూరంలో ఉండటం వల్ల.. మనకు మిగతా రోజులతో పోలిస్తే ఈ పౌర్ణమి నాడు చాలా చిన్నగా కనిపించబోతున్నాడు.

బ్లూ మూన్ అంటే ఏమిటి..

పేరులో ‘బ్లూ’ (నీలం) అని ఉన్నంత మాత్రాన చంద్రుడు నిజంగా నీలం రంగులోకి మారిపోడు. మరి బ్లూమూన్ అంటే ఏంటంటే.. ఒకే క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణమిలు వస్తే.. రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు. ఈ అరుదైన ఖగోళ ఘట్టం సాధారణంగా ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు.

సాధారణంగా భారతదేశం అంతటా ప్రజలు మే 31 సాయంత్రం ఈ బ్లూ మూన్‌ను వీక్షించవచ్చు. 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య బ్లూమూన్ ని దర్శించవచ్చు. వాతావరణం నిర్మలంగా ఉంటే ఎలాంటి టెలిస్కోప్, బైనాక్యులర్స్ అవసరం లేకుండానే ఈ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

చాలా మంది బ్లూ మూన్‌ను, సూపర్‌మూన్‌తో కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ ఈ రెండు పూర్తిగా వేర్వేరు సంఘటనలు. బ్లూ మూన్ అనేది క్యాలెండర్ ఆధారంగా నిర్ణయించబడుతుంది, ఇది కేవలం ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని మాత్రమే సూచిస్తుంది. మరోవైపు, పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు ‘సూపర్‌మూన్’ సంభవిస్తుంది, దీనివల్ల చంద్రుడు సాధారణం కంటే చాలా పెద్దదిగా, అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు.