Vaishakha Amavasya 2026 : వైశాఖ అమావాస్య.. ఏప్రిల్ 16 లేదా ఏప్రిల్ 17నా.. పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు
Vaishakha Amavasya 2026 : హిందూ పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్యను చాలా విశిష్టమైందిగా భావిస్తారు. మరి ఇంతకు ఈ ఏడాది వైశాఖ అమావాస్య ఎప్పుడు వచ్చిందంటే..
- Dharani Pilli
- Updated on- April 14, 2026 / 09:34 PM IST
Vaishakha Amavasya 2026 date significance Vrat and Puja Vidhi details here
Vaishakha Amavasya 2026 : ప్రతి నెలా అమావాస్య వస్తుంది. కానీ హిందువులకు మాత్రం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య చాలా విశిష్టమైనది. సాధారణ అమావాస్యలతో పోలిస్తే వైశాఖ అమావాస్యకు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఆ రోజున పితృదేవతలకు తర్పణాలు, నైవేద్యాలు సమర్పించడానికి అత్యంత అనుకూలమైన సమయం. శక్తి మేర దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇంత ప్రాముఖ్యత కలిగిన వైశాఖ అమావాస్య ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది అనే దానిపై ఉన్న గందరగోళానికి పండితుల వివరణ ఇక్కడ ఉంది.
వైశాఖ అమావాస్య ఎప్పుడు
2026లో వైశాఖ అమావాస్య ఏప్రిల్ 16న రాత్రి 8:11 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 17న సాయంత్రం 5:21 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం ఆధారంగా లెక్కించే ఉదయ తిథి ప్రకారం, ఏప్రిల్ 17న అమావాస్యను పాటించాలని పండితులు చెబుతున్నారు.
వైశాఖ అమావాస్య నాడు చేయాల్సిన పనులు:
పవిత్ర స్నానం: ఈ రోజున తెల్లవారుజామునే (బ్రాహ్మీ ముహూర్తంలో) నిద్రలేచి పవిత్ర నదులైన గంగ, గోదావరిలో స్నానం చేయడం అత్యంత ప్రయోజనకరం. అది సాధ్యం కాకపోతే, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల గంగాజలం, నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ఆచారంలో భాగం.
- ఉపవాసం: వైశాఖ అమావాస్య రోజున చాలా మంది కేవలం పండ్లు మాత్రమే తీసుకుని ఉపవాసం ఆచరిస్తారు.
- పితృ తర్పణం: ఈ రోజు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది. అందుకే దర్భలు, నల్ల నువ్వులు, నీటితో పితృదేవతలకు తర్పణం వదలాలి. దీనివల్ల పితృ దోషాలు తొలగి, వంశాభివృద్ధి జరుగుతుందని నమ్ముతారు.
- దేవతారాధన: వైశాఖ అమావాస్య నాడు శివుడిని లేదా విష్ణువుని పూజించాలి. వైశాఖ మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి ‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని ఎన్ని ఎక్కువ సార్లు జపిస్తే అంత మంచిది. అలాగే ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని కూడా జపించవచ్చు.
- దానధర్మాలు: ఈ రోజున చేసే దానాల వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కనుక.. దాహంతో ఉన్నవారికి మంచినీరు, మజ్జిగ, పెరుగన్నం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు దానం చేయడం విశేష పుణ్యాన్నిస్తుంది.
- రావి చెట్టు పూజ: పూర్వీకుల పేరు మీద వస్త్రదానం చేయడం మరియు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. 10tv దీన్ని నిర్ధారించడం లేదు
