Akshaya Tritiya 2026 : బంగారం అంటే మాకు ప్రాణం.. ధర పెరిగినా తగ్గేదేలే.. ఒక్క రోజే రూ.20 వేల కోట్ల వ్యాపారం..
Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ వేళ బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి.
- Dharani Pilli
- Updated on- April 19, 2026 / 09:35 PM IST
Akshaya Tritiya 2026 india set to buy massive gold around Rs 20000 Crore Trade
Akshaya Tritiya 2026 : భారతీయులు మరీ ముఖ్యంగా హిందువులు అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజు బంగారం కొంటే కలసి వస్తుందని నమ్ముతారు. చాలా మంది అప్పు చేసైనా సరే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటారు. ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ సందర్భంగా జనాలు బంగారం కొనడానికి ఎగబడ్డారు. ఏప్రిల్ 19, ఆదివారం అక్షయ తృతీయ సందర్భంగా దేశంలో బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 2026 అక్షయ తృతీయ సందర్భంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకోనున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, అక్షయ తృతీయ సందర్భంగా ఈ రోజు మొత్తం బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాభరణాల కొనుగోళ్ల వ్యాపారం రూ. 20,000 కోట్లు దాటే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. గత ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా రూ. 16,000 కోట్ల వ్యాపారం జరగ్గా.. దానితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. బంగారం, వెండి ధరలు పెరిగినప్పటికీ కొనుగోలుదారుల్లో అక్షయ తృతీయ సెంటిమెంట్ బలంగా ఉందంటున్నారు. అయితే కొనుగోలు చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఈ ఏడాది ధరలు ఇలా..
గత సంవత్సరం అక్షయ తృతీయ వేళ 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 1,00,000 ఉండగా, ఈ ఏడాది అది రూ. 1.58 లక్షలకు చేరుకుంది. గతేడాది వెండి ధర కూడా కిలో రూ. 85,000 నుండి ఏకంగా రూ. 2.55 లక్షలకు పెరిగింది. సాధారణంగా ధరలు ఇంత భారీగా పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కానీ బంగారం కొనుగోళ్ల విషయంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
చాందీ చౌక్ ఎంపీ, CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “భారతీయులు బంగారం కొనడానికి అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. బంగారానికి డిమాండ్ అధికంగా, బలంగా ఉన్నప్పటికీ, విపరీతమైన ధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు” అని పేర్కొన్నారు.
స్మార్ట్ కొనుగోళ్లు
బంగారం ధరలు పెరగడంతో వినియోగదారులు స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. భారీ ఆభరణాల కంటే తేలికపాటి (Lightweight), రోజువారీ వాడకానికి వీలయ్యే ఆభరణాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే వెండి, వజ్రాల ఆభరణాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి రిటైలర్లు మేకింగ్ ఛార్జీల తగ్గింపు, ఉచిత బంగారు నాణేలు వంటి ఆఫర్లను ప్రకటిస్తున్నారు.
ఈ ఏడాది బంగారం కొనుగోళ్లు చూసుకుంటే.. వ్యాపార విలువ పెరుగుతున్నప్పటికీ, అమ్ముడయిన బంగారం పరిమాణం (Quantity) మాత్రం తగ్గిందని బులియన్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రూ. 16,000 కోట్ల వ్యాపారం అంటే దాదాపు 10 టన్నుల బంగారం మాత్రమే. దీనివల్ల వ్యాపారుల వద్ద జరిగే అమ్మకాల పరిమాణం గతంతో పోలిస్తే తక్కువగానే ఉంటోంది. మరోవైపు డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల (ETFs) వైపు కూడా పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.
