RBI Plastic Notes : ఆర్బీఐ బిగ్ డెసీషెన్.. పాలిమర్ నోట్లు వచ్చేస్తున్నాయ్..! వీటివల్ల ఉపయోగాలు.. ఏఏ దేశాల్లో వినియోగంలో ఉన్నాయంటే?
RBI Plastic Notes : మార్కెట్లోకి త్వరలో పాలిమర్ నోట్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. కొత్త తరహా కరెన్సీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.
RBI Considering polymer plastic bank notes to replace paper currency in india
- ఆర్బీఐ కీలక నిర్ణయం
- త్వరలో మార్కెట్లోకి పాలిమర్ నోట్లు
- పైలట్ ప్రాజెక్ట్ కు ఆర్బీఐ సన్నాహాలు
RBI Plastic Notes : భారతదేశంలో త్వరలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే అవకాశాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పరిశీలన కొనసాగుతోంది. దేశంలో పెరుగుతున్న కరెన్సీ వినియోగం, నకిలీ నోట్ల సమస్యను తగ్గించడం, నోట్ల జీవితకాలాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో త్వరలో పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా రూ.10, రూ.20 విలవైన బ్యాంక్ నోట్లను ఆర్బీఐ వినియోగంలోకి తీసుకురానుంది. 2027 నాటికి పూర్తి స్థాయిలో పాలిమర్ నోట్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మనుగడలో ఉంటాయి. ఇవి నీటికి తడవవు. చిరిగిపోవడం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధునాతన భద్రత చర్యలతో ఈ నోట్లు తయారు చేస్తుండటంతో నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు అధిక స్థాయిలో అవకాశం ఉంటుంది. నోట్ల ముద్రణ, మార్పిడి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటిని ఆస్ట్రేలియా, కెనడా, యూకే, సింగపూర్ వంటి అనేక దేశాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. భారతదేశంలో కూడా గతంలో పరిమిత స్థాయిలో పాలిమర్ నోట్లపై ప్రయోగాలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అమలు కాలేదు.
పాలిమర్ నోట్ల తయారీలో భాగంగా ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థమైన పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్ల తయారీ, సరఫరా కోసం ఆర్బీఐ నోట్ల ముద్రణా విభాగం గ్లోబల్ ఆసక్తి వ్యక్తీకరణను (ఈఓఐ) జారీ చేసింది. ఆగస్టు 18వ తేదీ నాటికి బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. దీంతో త్వరలోనే మార్కెట్లోకి పాలిమర్ నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
2027నాటికి పూర్తిస్థాయిలో పాలిమర్ నోట్లు మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత రూ.10, రూ. 20 విలువైన బ్యాంక్ నోట్లను ఆర్బీఐ వినియోగంలోకి తీసుకురానుంది. వీటిపై అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయిలో పాలిమర్ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై ఆర్బీఐ చర్యలు చేపట్టనుంది.
పాలిమర్ నోట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న కాగితపు (కాటన్ ఆధారిత) నోట్లను వెంటనే ఉపసంహరించుకునే నిర్ణయం ఏదీ ఆర్బీఐ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న “కాగితపు నోట్లు రద్దు చేసి ప్లాస్టిక్ నోట్లు మాత్రమే వస్తాయి” అనే వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇప్పటికే స్పష్టం చేశాయి. ప్రస్తుతం చెలామణిలో ఉన్న అన్ని చెల్లుబాటు అయ్యే నోట్లు యథావిధిగా చెల్లుబాటులోనే ఉంటాయి.
