Birkin Bags vs Gold : బంగారం కన్నా బిర్కిన్ బ్యాగ్ బెటర్ ఇన్వెస్ట్‌మెంటా? అసలు ఈ ఖరీదైన బ్యాగులో ఏముంది? ఎందుకింత క్రేజ్..!
Birkin Bags vs Gold : బిర్కిన్ బ్యాగుల విలువ రానున్న 5 ఏళ్లలో రెట్టింపు కాగలదు. బంగారం కన్నా ఇది ఎందుకు విలువైన పెట్టుబడిగా మారింది? హెర్మెస్ స్టోర్ నుంచే రాగానే బిర్కిన్ బ్యాగ్ వాల్యూ ఆకాశాన్నంటుతుంది. దీనికి అసలు కారణమేంటంటే?
- Sreehari A
- Updated on- September 4, 2026 / 03:00 PM IST
Birkin Bags vs Gold
- బంగారానికే పోటీ ఇస్తున్న లగ్జరీ బిర్కిన్ బ్యాగ్..
- వచ్చే ఐదేళ్లలో బంగారాన్ని తలదన్నేలా రెట్టింపు విలువ
- అసలు ఈ బ్యాగ్ విలువ ఇంతగా ఎందుకు పెరుగుతోంది?
- లగ్జరీ రీసేల్ నిపుణుడు జేమ్స్ ఫైర్‌స్టీన్ మాటల్లోనే..
Birkin Bags vs Gold : బంగారం.. ప్రతిఒక్కరూ కోరుకుంటారు.. ప్రపంచంలో బంగారానికి మించి మరి ఏదైనా ఉంటుందా? బంగారం విలువ కన్నా మించిన వస్తువు ఉందా? అంటే చాలానే ఉన్నాయి. అలాంటి వస్తువుల్లో బిర్కిన్ లగ్జరీ బ్యాగ్ ఒకటి.. ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లలో హెర్మెస్ బిర్కిన్‌కు ఉన్న క్రేజ్ వేరు.
వచ్చే ఐదేళ్లలో వాల్యూ డబుల్ :
కేవలం ఫ్యాషన్ యాక్సెసరీ కాదు.. కొంతమంది దృష్టిలో వాల్యూ పెరిగే కలెక్టబుల్ అసెట్. హెర్మెస్ నిపుణుడు జేమ్స్ ఫైర్‌స్టీన్ ప్రకారం.. కొన్ని బిర్కిన్ బ్యాగ్‌ల వాల్యూ వచ్చే ఐదేళ్లలోనే రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. గత దశాబ్దంలో బిర్కిన్, కెల్లీ బ్యాగ్‌ల రీసేల్ వాల్యూ కొన్ని సందర్భాల్లో బంగారాన్ని కూడా మించిందని ఆయన చెబుతున్నారు.
బిర్కిన్ బ్యాగ్ ఏంటి?
హెర్మెస్ 1837లో గుర్రపు సామగ్రి తయారీ సంస్థగా ప్రస్థానం మొదలైంది. కాలక్రమంలో లెదర్ వస్తువులు, ఫ్యాషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్‌గా ఎదిగింది. బిర్కిన్ బ్యాగ్‌కు పేరు ప్రముఖ నటి, గాయని జేన్ బిర్కిన్ నుంచి వచ్చింది.
1984లో విమాన ప్రయాణంలో హెర్మెస్ అధికారి జీన్-లూయిస్ డ్యూమాస్‌ను ఆమె కలిశారు. తన అవసరాలకు సరిపోయే బ్యాగ్ దొరకడం లేదని ఆమె చెప్పారు. తనకు కావాల్సిన డిజైన్‌ను గీసి చూపించగా దాన్నే ఆధారంగా చేసుకుని హెర్మెస్ బిర్కిన్‌ను రూపొందించింది.
బిర్కిన్ తయారీ ఎలా? :
బిర్కిన్ తయారీ కేవలం నార్మల్ ఫ్యాషన్ బ్యాగ్‌లా కాదు. అత్యుత్తమ లెదర్, క్వాలిటీ మెటీరియల్స్, నైపుణ్యమైన కళాకారుల చేతిపని దీని స్పెషాలిటీ.. హెర్మెస్ సొంత ఫ్యాక్టరీలు, లెదర్ వర్క్‌షాప్‌లపై ఆధారపడి ఉంటుంది. ప్రతి బ్యాగ్‌లో కటింగ్, కుట్టు, ఎడ్జ్ ఫినిషింగ్, మెటల్ ఫిట్టింగ్స్ వంటివి చాలా జాగ్రత్తగా చేస్తారు. అందుకే ఒక బిర్కిన్ బ్యాగ్‌ను కేవలం బ్రాండెడ్ బ్యాగ్‌గా కాకుండా తరతరాల పాటు నిలిచే హస్తకళా వస్తువుగా భావిస్తారు.
అంతగా బ్యాగులో ఏముంది? :
బిర్కిన్ వాల్యూను డిసైడ్ చేసేది కేవలం హెర్మెస్ పేరు కాదు. కలర్, లెదర్ టైప్, సైజు, చాలా అరుదైనది, మంచి కండిషన్, డిమాండ్ కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అరుదైన రంగులు, మెటీరియల్స్, మంచి కండిషన్‌లో ఉన్న బ్యాగ్‌లకు రీసేల్ మార్కెట్‌లో భారీ డిమాండ్ తప్పక ఉంటుంది.
Read Also : IRDAI Insurance Rules : ఇన్సూరెన్స్ తీసుకున్నారా? ఇక పాలసీ వివరాలన్నీ ఒకేచోట.. క్లెయిమ్‌లపై కొత్త రూల్స్!
దీనికి మరో కారణం కొరత కూడా. హెర్మెస్ స్టోర్‌లో బిర్కిన్‌ను కోరుకున్న వెంటనే కొనడం సాధ్యం పడదు. కొనుగోలు హిస్టరీ ఉన్న కస్టమర్లకే కొన్ని సందర్భాల్లో ‘కోటా బ్యాగ్’ కొనేందుకు ఛాన్స్ ఉంటుంది. అయినా వారంతా కోరుకున్న మోడల్, కలర్ లేదా మెటీరియల్ తప్పనిసరిగా దొరుకుతుందనే గ్యారెంటీ ఉండదు. ఈ కొరత కారణంగానే రీసేల్ మార్కెట్‌లో బిర్కిన్ బ్యాగుల ధరలు పెరుగుతున్నాయి.
పికాసోను కొనడం లాంటిది :
ఫైర్‌స్టీన్ బిర్కిన్‌ను పికాసో పెయింటింగ్‌తో పోల్చారు. ఇంట్లో పెట్టుకునే కళాఖండంలా బిర్కిన్‌ను వాడుకోవచ్చు. అవసరం లేదంటే కొంతకాలం తర్వాత అమ్మేసి మరో మోడల్ తెచ్చుకోవచ్చు. అయితే ఇది గ్యారంటీ ఇచ్చే పెట్టుబడి కానే కాదు. బ్లాక్ టోగో 30 వంటి కొన్ని మోడళ్ల విలువ ఐదేళ్లలో రెట్టింపు అయినా ఫ్యాషన్ ట్రెండ్లు, డిమాండ్, కండిషన్ మారితే ధరలు కూడా మారవచ్చు. అందుకే బిర్కిన్‌ను బంగారానికి ప్రత్యామ్నాయంగా కాకుండా వాడుకునే వస్తువుగా లేదా అరుదైన విలువ పెరిగే లగ్జరీ ఆస్తిగానే చూడాలి.
ఒక మాటలో చెప్పాలంటే.. బిర్కిన్‌లో మీరు కొనేది కేవలం బ్యాగ్ కాదు.. అది హెర్మెస్ వారసత్వం, హస్తకళ, అరుదు, బ్రాండ్ వాల్యూ, ఫ్యూచర్ రీసేల్ వంటి కారణంగా కొంతమందికి బిర్కిన్ ఒక ఫ్యాషన్ వస్తువు కన్నా చేతిలో పెట్టుకునే విలువైన ఆస్తిగా మారిపోయింది.
అయితే, ప్రతి బిర్కిన్ బ్యాగ్ వాల్యూ తప్పకుండా పెరుగుతుందా అంటే అలా చెప్పలేం. ఫ్యాషన్ ట్రెండ్లు, మార్కెట్ డిమాండ్, బ్యాగ్ కండిషన్, అరుదైన రంగులు, మెటీరియల్స్ ధరపై ప్రభావం పడుతుంది.
అందుకే ఈ బ్యాగును కచ్చితమైన పెట్టుబడిగా కాకుండా రిస్క్ ఉన్న కలెక్టబుల్ అసెట్‌గానే చూడాలి. అంటే బిర్కిన్ బ్యాగ్ కొనడమంటే కేవలం ఖరీదైన బ్యాగ్ కొనడం కాదు. ఇది అన్ని బ్యాగుల్లానే వాడుకోవచ్చు. అదే డిమాండ్ కొనసాగితే భవిష్యత్తులో లాభంతో భారీ మొత్తానికి అమ్ముకోవచ్చు.
