Nirmala Sitharaman (Image Credit To Original Source)
Union Budget 2026: జీవన సౌలభ్యం మెరుగుదల, సాధారణ పన్ను చెల్లింపుదారులకు ఊరటనివ్వడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ 2026లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నుల సంబంధిత ప్రతిపాదనలు చేశారు. ఆదాయ పన్ను వ్యవస్థను మరింత సరళంగా, పౌరులకు అనుకూలంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
వ్యక్తికి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ మంజూరు చేసే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుందని సీతారామన్ ప్రకటించారు. కోర్టు లేదా ట్రైబ్యునల్ నిర్ణయంతో ప్రధాన పరిహారానికి అదనంగా చెల్లించాల్సిన వడ్డీ మొత్తంపై టీడీఎస్ మినహాయింపు ఉంటుంది. ఈ మినహాయింపు కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు లాంటి వాటికి వర్తించవు.
టీడీఎస్ మినహాయింపు ద్వారా ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుతుంది. పన్నుల విధానాల వల్ల పరిహార మొత్తం తగ్గకుండా ఉండేలా బడ్జెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Union Budget 2026: ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? మీ జేబుకు చిల్లు ఎక్కడ పడుతుందంటే?
విదేశాలకు వెళ్తున్నారా..? టీసీఎస్ రేటు తగ్గింపు
విదేశీ ఖర్చులపై టాక్స్ కలెక్షన్ అట్ సోర్స్‌లో భారీ తగ్గింపు ప్రకటనను కూడా సీతారామన్ చేశారు. విదేశీ టూర్ ప్రోగ్రామ్ ప్యాకేజీల విక్రయంపై టీసీఎస్ రేటు 2 శాతానికి తగ్గింపును ఆమె ప్రతిపాదించారు. టీసీఎస్ అంటే విక్రయ సమయంలో వసూలు చేసే పన్ను విధానం.
ప్రస్తుతం టీసీఎస్ రేట్లు 5 శాతం, 20 శాతంగా ఉన్నాయి. 2 శాతం తగ్గించిన రేటు ఎలాంటి పరిమితి షరతులు లేకుండా వర్తిస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. దీంతో విదేశీ ప్రయాణ లావాదేవీలు సులభం కావడమేగాకుండా, పన్ను చెల్లింపుదారులపై తక్కువ భారం పడేలా పడుతుంది.
విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్తున్నారా?
మరో ఊరటనిచ్చే ప్రకటనను కూడా సీతారామన్ చేశారు. లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ కింద విద్యాభ్యాసం, వైద్య అవసరాల నిమిత్తం విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ రేటు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈ విభాగాల్లో టీసీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గుతుంది. లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ అంటే వ్యక్తులు విదేశాలకు నిర్దిష్ట పరిమితుల్లో డబ్బు పంపే పథకం.
“లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ ద్వారా విద్యాభ్యాసం, వైద్య అవసరాల నిమిత్తం పంపే మొత్తాలపై టీసీఎస్ రేటు తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నాను” అని సీతారామన్ తెలిపారు. దీంతో విదేశాల్లో చదువు, వైద్యం కోసం డబ్బు పంపే కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది
పన్ను మినహాయింపుల్లో స్పష్టత తీసుకురావాలనే ఉద్దేశంతో మానవ వనరుల సేవల సరఫరాను చెల్లింపును కాంట్రాక్టర్ల పరిధిలోకి ప్రత్యేకంగా తీసుకువస్తామని సీతారామన్ చెప్పారు. దాంతో ఈ సేవలపై టీడీఎస్ రేటు 1 శాతం లేదా 2 శాతంగా ఉంటుంది. దీంతో టీడీఎస్ రేట్లపై తలెత్తే వివాదాలు తగ్గుతాయి.