Credit Card Rules : క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే బిల్లు ఎవరు కడతారు? బ్యాంకు ఎలా వసూలు చేస్తుంది?

Credit Card Rules : క్రెడిట్ కార్డుదారుడు ఒకవేళ మరణిస్తే.. అతడు తీసుకున్న లోన్ పూర్తిగా చెల్లించని పక్షంలో బ్యాంకులు మిగిలిన మొత్తాన్ని ఎలా వసూలు చేసుకుంటాయో తెలుసా? ఆర్బీఐ రూల్స్ ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Credit Card Rules ( Image Credit : AI )

  • క్రెడిట్ కార్డుదారుడు మరణిస్తే అతడి బిల్లు ఎవరు చెల్లిస్తారు?
  • మరణించిన వ్యక్తి లోన్ మిగిలిన మొత్తాన్ని ఎలా వసూలు చేయగలదు
  • ఫ్యామిలీకి సంబంధం ఉండదా? వారసులకు బాధ్యత ఉంటుందా?

Credit Card Rules : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామందికి క్రెడిట్ కార్డు అనేది అత్యవసరంగా మారింది. డబ్బులు అవసరం ఉన్నా లేకున్నా క్రెడిట్ కార్డు వాడేవారు చాలామంది ఉంటారు. కొంతమంది క్రెడిట్ కార్డును క్రమశిక్షణతో వాడుతుంటారు. మరికొందరు అదేపనిగా అనవసర ఖర్చులు చేస్తూ అప్పుల్లో చిక్కుకుంటారు. కార్డు లోన్ లేదా బిల్లు సకాలంలో చెల్లించకపోతే భారీ మొత్తంలో వడ్డీ, పెనాల్టీలు పడతాయి.

అదే కార్డుదారుడు మరణిస్తే అతడు తీసుకున్న లోన్ మిగిలిన మొత్తాన్ని ఎవరు చెల్లించాలి? అసలు (Credit Card Rules) చెల్లించకపోతే ఏమౌతుంది? ఒకవేళ కార్డుదారుడి ఫ్యామిలీలోని వ్యక్తులు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందా? అంటే ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఎలా లోన్ మొత్తాన్ని రాబట్టుకుంటాయి? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్ కార్డు అంటేనే అన్‌సెక్యూర్డ్ లోన్.. బ్యాంకు ఈ లోన్ కోసం తాకట్టుగా ఏం తీసుకోదు. ఇల్లు, భూమి, గోల్డ్ ఏది కూడా తాకట్టు అవసరం ఉండదు. మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌ ఆధారంగా క్రెడిట్ కార్డు జారీ చేస్తాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. ఈ క్రెడిట్ లోన్లకు పూర్తి బాధ్యత కార్డుదారుడిదే వహించాలి. అందుకే కార్డుదారుడు మరణించినా బ్యాంకు ఫ్యామిలీ లేదా వారసులపై ఒత్తిడి చేయదు. ఫ్యామిలీలో ఇతరుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రుణం చెల్లించాల్సిన పనిలేదు.

బ్యాంకు రుణాన్ని ఎలా వసూలు చేస్తుంది :
క్రెడిట్ కార్దుదారుడు మరణం తర్వాత లోన్ మొత్తాన్ని చెల్లించేందుకు అతడి ఫ్యామిలీ వ్యక్తిగతంగా బాధ్యత వహించదు. అయినా ఆ లోన్ వెంటనే క్యాన్సిల్ కాదు. రుణం కూడా వెంటనే మాఫీ కాదు. మరణించిన వ్యక్తి ఆస్తుల నుంచి బ్యాంకు డబ్బులు రాబట్టుకుంటుంది.

Read Also : Gold Demand Drop : గోల్డ్ ఢమాల్..! 70 శాతం తగ్గిన డిమాండ్.. బంగారం కొనాలా? ఆగాలా? అసలు కారణాలివే..!

ఉదాహరణకు… బ్యాంకులు లీగల్ గా మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తుల్లో బ్యాంకు అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, గోల్డ్, షేర్లు వంటి ఆస్తుల కోసం ముందుగా క్లెయిమ్ చేస్తుంది. బ్యాంకులు మిగిలిన బకాయి మొత్తాన్ని వీటి నుంచే రాబట్టుకుంటుంది.

ఒకవేళ క్రెడిట్ కార్డుదారుడు మరణించి అతడి ఆస్తులన్నీ వారసుడు వారసత్వంగా పొందితే ఏమౌతుందంటే.. అప్పుడు బ్యాంకు వారసుడి నుంచి కార్డు మిగతా బ్యాలెన్స్ వసూలుచేస్తుంది. ఇక్కడ ఒక మెలిక ఉంది.. వారసుడు వారసత్వంగా పొందిన ఆస్తికి సమానమైన మొత్తాన్ని మాత్రమే చెల్లించగలడు.

ఉదాహరణకు.. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ రూ. 7 లక్షలు ఉంటే.. వారసత్వంగా వచ్చిన ఆస్తి రూ. 5 లక్షలు అనుకుందాం.. ఇప్పుడు సదరు బ్యాంకు, వారసుడి నుంచి రూ. 5 లక్షలను మాత్రమే వసూలు చేయగలదు. మిగిలిన రూ. 2 లక్షలను బ్యాంకు టచ్ చేయకూడదు.

మరణించిన వ్యక్తికి ఆస్తులు లేకున్నా :
ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు లోన్ వసూలు చేసే అవకాశం ఉండదు. అప్పుడు ‘బ్యాడ్ డెట్’, నాన్-పెర్ఫార్మింగ్ ప్రాపర్టీ (NPA)గా పరిగణించి రద్దు చేస్తాయి. అంటే.. ఈ లోన్ మాఫీ అవుతుంది. డబ్బులు చెల్లించేందుకు చట్టపరమైన ఆస్తులు లేవు.

అదే హామీదారులు లేదా జాయింట్ హోల్డర్లు ఉన్నట్టయితే ఈ విషయంలో బ్యాంకు రూల్ వేరుగా ఉంటుంది. జాయింట్ కార్డు ఉంటే.. వ్యక్తి మరణం తర్వాత మిగతా బ్యాలెన్స్ చెల్లించే బాధ్యత ఆ కార్డు వాడే మరొకరిపై ఉంటుంది. లేదా ఎవరైనా హామీదారుగా సైన్ పెట్టి ఉంటే బ్యాంకు వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది.

కుటుంబ సభ్యులు ఇలా చేయండి :
క్రెడిట్ కార్డుదారుడి మరణం అనంతరం అతడి ఫ్యామిలీ వీలైనంత త్వరగా బ్యాంకుకు ఈ విషయం చెప్పాలి. అప్పుడు బ్యాంకు ఆ కార్డుపై వడ్డీ, పెనాల్టీలు, వసూలు చేయదు. బ్యాంకు వెంటనే అకౌంట్ బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత కార్డు పేమెంట్లు ఆగిపోతాయి. అదనపు ఛార్జీలు కూడా పడవు. త్వరగా డెత్ సర్టిఫికేట్ బ్యాంకులో సమర్పిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

రికవరీ ఏజెంట్ వేధిస్తే ఏం చేయాలి? :
రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వచ్చి మీ వ్యక్తిగత ఆస్తులమ్మి కట్టాలంటూ బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అవసరమైతే ఆర్బీఐ లోక్‌పాల్ (అంబుడ్స్‌మన్)కి సైతం కంప్లయింట్ చేయొచ్చు.

ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా? :
అన్ని క్రెడిట్ కార్డులకు ఉండదు. కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులకు మాత్రమే ‘క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్’ కవర్‌ ఉంటుంది. ఒకవేళ క్రెడిట్ కార్డుదారుడు ఏదైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన మొత్తాన్ని పే చేస్తుంది. అందుకే మరణించిన వ్యక్తి ఫ్యామిలీతో క్రెడిట్ కార్డుతో అందించిన ఇన్సూరెన్స్ గురించి చెక్ చేయాలి.