Cooking Oil Prices: పండుగల వేళ కేంద్రం తీపి కబురు.. భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
వంటనూనెల ధరల(Cooking Oil Prices) భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- September 24, 2026 / 09:53 AM IST
Central Government taken key decision to reduce customs duties on cooking oils
Cooking Oil Prices: నిత్యవసర ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న వంటనూనెల ధరలను అదుపులోకి తీసుకురావడంలో భాగంగా సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్‌లకు సంబంధించిన ముడి (క్రూడ్), రిఫైన్డ్ రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) భారీగా తగ్గిస్తూ కేంద్రం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో రిటైల్ మార్కెట్లో నూనెల ధరలు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వివిధ రకాల నూనెలపై అమల్లోకి వచ్చిన కొత్త సుంకాలు;
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ముడి పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి ఏకంగా సున్నాకు కుదించారు. అలాగే రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై(Cooking Oil Prices) సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు. దీనితో పాటు ముడి సోయాబీన్, క్రూడ్ పామాయిల్‌పై పన్నును 10 శాతం నుంచి 5 శాతానికి, రిఫైన్డ్ సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై సుంకాన్ని 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గించడమైనది.
నేటి నుంచే ఉత్తర్వులు అమలు – సామాన్యులకు ఊరట:
సుంకాల కోతకు సంబంధించిన సవరించిన నిబంధనలు సెప్టెంబరు 24 నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ ఉపశమన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో నిత్యావసర బడ్జెట్‌తో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఊరట లభించనుంది.
