LPG Price Hike : బిగ్‌షాక్.. మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే
LPG Price Hike : గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది.
- Dharani Pilli
- Updated on- June 1, 2026 / 09:34 AM IST
Commercial LPG cylinder price hike rs 42 from June 1
- మరోసారి పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర
- రూ.42 పెంచుతూ నిర్ణయం
- ఢిల్లిలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,113.50
LPG Price Hike : మరోసారి గ్యాస్ బండ ధర పెరిగింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచి మన దేశంలో గ్యాస్ సిలిండర్ ధర, మరీ ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాటికి వినియోగించే వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా జూన్ నెల ప్రారంభంలోనే మరోసారి వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. ఇప్పటికే ఇంధన, రవాణా ఖర్చుల పెరుగుదలతో సతమతమవుతున్న వ్యాపారాలకు.. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం మరింత ఇబ్బందికరంగా మారింది.
దీనితో పాటు 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ (FTL) సిలిండర్ల ధరలు కూడా రూ. 11 పెరిగాయి. ఢిల్లీలో ఇప్పుడు వీటి ధర రూ. 821.50 గా ఉంటుంది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే (డొమెస్టిక్) ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
నగరాల వారీగా పెరిగిన ధరలు
ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 42 పెరిగింది. దీంతో జూన్ 1 నుంచి దీని రిటైల్ ధర రూ. 3,113.50 కి చేరింది. కోల్‌కతాలో ఈ పెంపు మరింత ఎక్కువగా రూ. 53.50 గా ఉంది, అక్కడ సిలిండర్ ధర రూ. 3,255.50 కి పెరిగింది. ఈ ఏడాది ప్రారంభం నుండి వాణిజ్య ఎల్‌పీజీ ధరలు విపరీతంగా పెరిగాయి. జనవరిలో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,691.50 గా ఉండేది. ఆ తర్వాతి నెలల్లో వరుసగా జరిగిన ధరల సవరణలతో ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ. 3,113.50 కి చేరుకుంది.
ఐదు నెలల్లో ధరల పెంపు ఇలా…
- ఫిబ్రవరి: రూ. 49 పెరిగింది.
- మార్చి: మరో రూ. 115 పెరిగింది.
- ఏప్రిల్: అత్యంత గరిష్టంగా ఒకేసారి సిలిండర్‌పై రూ. 993 భారీగా పెరిగింది.
- మే: ధరలు అదే గరిష్ట స్థాయిలో కొనసాగాయి.
- జూన్: మళ్లీ ధరలు పెరిగాయి.
దీని ఫలితంగా కేవలం ఐదు నెలల వ్యవధిలోనే వాణిజ్య ఎల్‌పీజీ ఖర్చులు దాదాపు రెట్టింపు అయ్యాయి.
సీఎన్‌జీ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఎల్‌పీజీ ధర పెంచడానికి కొన్ని రోజుల ముందే ఇతర ఇంధన ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీ, దాని పరిసర నగరాల్లో సీఎన్జీ ధరలు కేజీకి రూ. 2 పెరిగాయి. ఈ తాజా సవరణతో సీఎన్‌జీ ధర కేజీ రూ. 83.09 కి చేరింది. గడిచిన రెండు వారాల లోపే ఇలా ధర పెరగడం ఇది నాలుగవ సారి.
అలానే గత కొన్ని వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. పలు విడతల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 7.35, డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.53 చొప్పున పెరిగాయి.
