Credit Card: పొరపాటున కూడా మీ క్రెడిట్ కార్డును ఈ పనుల కోసం వాడకండి.. లేదంటే అప్పులపాలవ్వడం గ్యారంటీ
క్రెడిట్ కార్డు(Credit Card) వాడే విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.
- V Santhosh Kumar
- Published on- June 4, 2026 / 02:58 PM IST
Do not use your credit card for these purposes not even by mistake
- ఈ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడకండి
- ఏటీఎం నగదు విత్‌డ్రాలకు భారీ వడ్డీ
- చిన్న ఖర్చులకు నగదు మాత్రమే వాడండి
Credit Card: ప్రస్తుత రోజుల్లో రూపే కార్డులను యూపీఐకి లింక్ చేసుకునే సదుపాయం రావడంతో, చిన్న చిన్న లావాదేవీలకు కూడా క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇది చెల్లింపులను సులభతరం చేసినప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కార్డును వాడకపోవడమే ఆర్థికంగా శ్రేయస్కరం. లేదంటే కొత్త చిక్కులు కొనితెచ్చుకోవడం ఖాయం. మరి ఆ పనులు ఏంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏటీఎం నగదు ఉపసంహరణ:
క్రెడిట్ కార్డు(Credit Card) పరిమితిలో 20 శాతం వరకు ఏటీఎం నుండి నగదు తీసుకునే వీలున్నప్పటికీ, అత్యవసరమైతే తప్ప ఈ పని చేయకండి. ఎందుకంటే విత్ డ్రా చేసిన రోజు నుంచే నెలకు సుమారు 2.85 శాతం భారీ వడ్డీ పడుతుంది. దీనికి తోడు 2.50 నుండి 3 శాతం వరకు అదనపు ట్రాన్సాక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
నిత్యావసరాలు, చిన్న మొత్తాల చెల్లింపులు:
కిరాణా సామాగ్రి, ఆహారం, గ్రోసరీస్ వంటి రోజువారీ గృహ అవసరాలకు క్రెడిట్ కార్డు వాడటం తగ్గించడం మంచిది. లేదంటే, మీ బడ్జెట్ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. ఇది నెలాఖరులో బిల్లుల భారాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న ఖర్చులకు నగదు లేదా డెబిట్ కార్డులను మాత్రమే ఉపయోగించడం మంచిది.
విదేశీ ప్రయాణాలు:
విదేశీ ప్రయాణాల కోసం క్రెడిట్ కార్డులు వాడితే కరెన్సీ మార్పిడి, ఫారిన్ లావాదేవీల పేరిట దాదాపు 3 శాతం వరకు అదనపు ఛార్జీలు విధిస్తారు. మీ క్రెడిట్ కార్డు నుంచి సంబంధిత బ్యాంకుకి ఏదైనా ఆఫర్స్ ఉంటె పరవాలేదు. లేదంటే, మీ జేబుకు కన్నం పడటం గ్యారంటీ. ఈ అనవసర భారాన్ని తగ్గించుకోవడానికి క్రెడిట్ కార్డుకు బదులుగా ‘ప్రీపెయిడ్ కరెన్సీ కార్డులను’ వాడటం ఉత్తమం.
సకాలంలో బిల్లులు కట్టలేని పరిస్థితి:
గడువులోగా పూర్తి బిల్లు చెల్లించలేనప్పుడు కార్డు అస్సలు వాడకండి. ఆలస్య రుసుము కింద రూ. 250 నుండి రూ. 600 వరకు జరిమానా పడుతుంది. బకాయిలపై లావాదేవీ జరిగిన తేదీ నుండి 2.5 నుండి 3 శాతం వడ్డీ విధిస్తారు. కేవలం మినిమం బ్యాలెన్స్ కడితే, మిగిలిన మొత్తంపై 5 శాతం వరకు వడ్డీ పడి అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
